KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మంత్రివర్గ సమావేశం తరువాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తారని అందరికి తెలియజేశారు. కానీ చివరి క్షణంలో దాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో అందరిలో ఒకటే ఉత్కంఠ. కేసీఆర్ ఏం చెబుతారో అనే దానిపైనే సమాలోచనలు చేశారు. కానీ ఏం అనుకున్నారో ఏమో కానీ ప్రెస్ మీట్ రద్దు చేసుకోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈసారి జాతీయ మీడియాను సైతం ఆహ్వానించారు. దీంతో ఇదేదో జాతీయ స్థాయి అంశంగానే అందరు పరిగణించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కేసీఆర్ విలేకరుల సమావేశాన్ని రద్దు చేసుకోవడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.

కొద్ది రోజులుగా కేసీఆర్ బీజేపీపై యుద్ధం చేస్తున్నారు. దేశంలో మూడో కూటమి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఇందుకు గానే బీజేపీయేతర పక్షాలతో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, బిహార్ నేతలు స్టాలిన్, పినరయ్ విజయన్, తేజస్వి యాదవ్ లతో సమావేశం నిర్వహించి దేశంలో థర్డ్ ఫ్రంట్ అవకాశాలపై చర్చించారు. దీంతో రాబోయే రోజుల్లో బీజేపీని ధీటుగానే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ లో కూడా సమాజ్ వాదీ పార్టీకి మద్దతు తెలిపి వారి తరఫున ప్రచారం చేసేందుకు కేసీఆర్ సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read: తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాపితం చేసిన ఘనుడు ‘ఎన్టీఆర్’ !
అయితే కరోనా కట్టడి చర్యలు, రాత్రి పూట కర్ఫ్యూ తదితర అంశాలపై మాట్లాడాల్సి ఉన్నా ఎందుకో ఆయన ప్రెస్ మీట్ రద్దు చేసుకోవడం చర్చనీయాంశం అయింది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రెస్ మీట్ పెడితే ఇటీవల నిర్వహిస్తున్న సమావేశాలపై ఓ క్లారిటీ ఇస్తారని భావించారు. కానీ ఆయన తన మనసులో ఏముందో ఎవరికి చెప్పకుండానే వెళ్లిపోవడం సంచలనం కలిగిస్తోంది.
గత కొంత కాలంగా టీఆర్ఎస్ చేస్తున్న మూడో కూటమి ఏర్పాట్లపై జాతీయ స్థాయిలో ప్రచారం సరిగా రావడం లేదు.దీంతో ఈ సారి జాతీయ స్థాయి మీడియాను కూడా ఆహ్వానించడం గమనార్హం. కానీ మూడో కూటమిపై మాట్లాడితే పలు ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. విలేకరులు కూడా ఎక్కువగా దానిపైనే ప్రశ్నిస్తే కచ్చితమైన సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నారా? అనే కోణంలో కూడా అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ మదిలో ఏముందో ఎవరికి తెలియకుండా పోయింది.
ఇప్పటికే టీఆర్ఎస్ బీజేపీతో కయ్యానికి కాలు దువ్వుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య వైరం నెలకొంది. దీన్ని అవకాశంగా తీసుకుని టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవాలని భావిస్తోంది. దీంతో ప్రెస్ మీట్ లో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతుందని భావించినా అది నెరవేరకపోవడం గమనార్హం. దీంతో టీఆర్ఎస్ బీజేపీని దెబ్బతీయడానికి ఏ వ్యూహం ఖరారు చేసుకుందో తెలియకుండా పోయింది. మొత్తానికి రాబోయే రోజుల్లో నైనా దీని గురించి సమగ్ర సమాచారం అందుతుందని అందరు ఎదురు చూస్తున్నారు.