Homeజాతీయ వార్తలుFree Schemes: ఫ్రీ’జాస్వామ్యం.. ఏది ఉచితం... ఏది అనుచితం

Free Schemes: ఫ్రీ’జాస్వామ్యం.. ఏది ఉచితం… ఏది అనుచితం

Free Schemes: తెలుగు దేశం పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో నాటì ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌టీ.రామారావు రూ.2 కిటో బియ్యం పథకం ప్రవేశపెట్టారు. నాడు మార్కెట్‌లో కిలో బియ్యం ధర రూ.15 నుంచి రూ.20 ఉంది. పేదల ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఎన్‌టీ రామారవు దానిని రూ.2 తగ్గించారు. తర్వాత ధర కాస్త అటూఇటుగా మారుతూ వచ్చింది. ఇప్పుడైతే ఏకంగా ఉచితంగా ఇస్తున్నారు. దీనిని ఎవరూ వ్యతిరేకించడం లేదు. ఎత్తివేయడానికి ఏ ప్రభుత్వమూ యత్నించడం లేదు.

Free Schemes
Free Schemes

– ఆరోగ్యశ్రీ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన మరో అద్భుతమైన ఉచిత పథకం. దీని ద్వారా లక్షలాది మంది ఇప్పటికీ చికిత్స చేయించుకుంటున్నారు. ఎంతోమందికి ఈ పథకం పునర్జన్మ ప్రసాదించింది. దీని పేరు మారుస్తున్నారు తప్ప ఎత్తివేసే సాహసం ఎవరూ చేయడం లేదు.

Also Read: Chandrababu- Pawan Kalyan: చంద్రబాబు, పవన్ ల భారీ స్కెచ్.. వైసీపీతో మైండ్ గేమ్

– పాఠశాలల్లో విద్యార్థులకు దశాబ్దాలుగా ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. దీంతో పాఠశాలల్లో పేద విద్యార్థుల గైర్హాజరు తగ్గింది. పౌష్టికాహార లోపం కూడా తగ్గింది. ఈ పథకం ఇప్పటికీ కొనసాగుతోంది. దీనిని కూడా ఎవరూ వ్యతిరేకించడం లేదు.

– ఇక కేంద్రంలో కిసాన్‌ సమ్మాన్‌ నిధి, తెలంగాణలో రైతుబంధు, రైతుబంధు, ఆంధ్రప్రదేశ్‌లో విద్యాకానుక, కాపునేస్తం, ఆటోనేస్తం, నవరత్నాలు అంటూ ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు. ఈ పథకాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పరిమితి విధించాలంటుంటే.. కొందరు ఇలాంటి నగదు పంపిణీ పథకాలతో ఆర్థిక సంక్షోభం తప్పదని హెచ్చరిస్తున్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యం అయిన భారత దేశంతో ఫ్రీ పథకాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభం వైపు తీసుకెళ్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఉచిత పథకాల అమలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ‘‘ఉచితాల’’ విషయంలో తప్పులు చేయకుండా .. దేశాన్ని నట్టేట ముంచేయకుండా ఏదో ఒకటి చేయాలని కొంత మంది సుప్రీంకోర్టుకు వెళ్లడం.. సుప్రీంకోర్టు కూడా అది నిజమేనని అంగీకరించి ఏం చేయాలో సిఫార్సులు చేయడానికి ఓ కమిటీని నియమించడ జరిగింది. ఈ నేపథ్యంలో ఉచితాలను పక్కన పెట్టి దేశం కోసం .. అభివృద్ధి కోసం ప్రయత్నించేలా చట్టం చేయడం సాధ్యమా? లేక రాజకీయ పార్టీలే స్వచ్ఛందంగా ఆలోచించి.. దేశాన్ని బాగు చేయాలని అనుకుంటే సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఓట్లు కొనడమే అసలు కారణం..
ప్రపంచంలో ఎన్నో ప్రజాస్వామ్య దేశాలున్నాయి. కానీ ఏ దేశంలో అయినా ఓట్లు కొనడం అనే కాన్సెప్ట్‌ లేదు. చాలా దేశాల్లో ప్రజాప్రతినిధులు 20 వేల నుంచి 30 వేల మందికే ఒకరు ఉంటారు. అలాంటి చోట్ల ఓట్ల కొనుగోలు ఉండదు. మన దేశంలో మాత్రం రెండున్నర లక్షల మంది ఓ ప్రజాప్రతినిధి ఉన్నా.. అతను తన గెలుపు కోసం యాభై , అరవై వేల ఓట్లు కొనేస్తాడు. వారికి పోటీగా ప్రభుత్వాలు ప్రజల సొమ్ముతో వారి ఓట్లు కొనేందుకు ఉచిత పథకాల హామీ ఇస్తున్నాయి.

సగం బడ్జెట్‌ ఉచితాలకే..
ఇప్పుడు దేశంలోని ప్రతీ రాష్ట్రంలో సంక్షేమం పేరుతో ఉచిత పథకాలు సగం రాష్ట్ర బడ్జెట్‌ను మింగేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు బడ్జెట్‌ను కూడా మించిపోయి.. అప్పులు చేసి మరీ పంచుతున్నాయి. ఉచిత పథకాల వలన ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది. దీని మూలంగా లోటు పెరుగుతుంది. అవసరమైన పనులకు, ప్రాజెక్టులకు నిధులు సరిపోవు. ఉచిత ప«థకాలు, సబ్సిడీలు అధికంగా ఇస్తే అది పరోక్షంగా ప్రజల దగ్గర ఉండే డబ్బును పెంచుతుంది, ప్రజలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. ఇది డిమాండ్‌ – సరఫరా అసమతుల్యతకు దారితీస్తుంది. డిమాండ్‌ పెరుగుతుంది కాబట్టి ధరలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని మనకు తెలుసు. ప్రజలకు కావాల్సింది ఉపాధి, నాణ్యమైన సరుకులు, మేలు రకం ఎరువులు, ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్య అంతే కానీ ఉచిత ప««థకాలు, తాయిలాలు కావు.

Free Schemes
Free Schemes

సంక్షేమం వేరు.. ఉచిత పథకాలు వేరు
– చాలా మంది విచిత్రమైన వాదనను తెరపైకి తెస్తూ ఉంటారు.పేద ప్రజలకు మేలు చేయవద్దా అని వాదిస్తూ ఉంటారు. ఉచిత పథకాలు దేశాభివృద్ధికి ప్రమాదకరమని ప్రధాని మోదీ అనగానే.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. ఇదే వాదనతో తెరపైకి వచ్చారు. పెద్దలకు లక్షల కోట్లు మాఫీ చేయవచ్చు కానీ పేదలకు ఉచిత బియ్యం.. విద్య.. వైద్యం ఇవ్వకూడదా అని ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చేశారు. ఇలాంటి బాధ్యతా రాహిత్య రాజకీయ నాయకులు ఉన్నంత కాలం దేశం ముందుకు అడుగు పడే అవకాశమే ఉండదు. దేశంలో ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కానీ ఇస్తున్నారా అంటే ఆలోచించాల్సిందే. ఆరోగ్యశ్రీ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో అమలవుతోంది.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం అందించే పథకం. మొదట్లో బాగా అమలయ్యేది .. ఇప్పుడెలా అమలవుతోంది ? ఆ పథకంపై ప్రచారానికి పెట్టే ఖర్చు కూడా ఇప్పుడు పెట్టడంలేదు. నిజంగా సంక్షేమం అంటే.. పేద ప్రజలకు నిజంగా అవసరం ఉన్న వారికి విద్యు, వైద్యం ఉచితంగా అందించేలా చూడటం సంక్షేమం. ఏ పనీ చేసుకోలేని వాళ్లకు కడుపు నింపడం సంక్షేమం. అంతే కానీ.. దేశంలో ఐదున్నర కోట్ల మంది ఉంటే.. నాలుగున్నర కోట్ల మందికి రేషన్‌ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సంక్షేమం కాదు. ఈ విషయం రాజకీయ నాయకులకు తెలియదా.. అంటే.. తెలియకుండా ఎలా ఉంటుంది. అన్నీ తెలిసే చేస్తున్నారు.

ఎన్నికల్లో గెలుపే ముఖ్యం…
మన దేశంలో రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపే ముఖ్యం. ప్రజలు కాదు! అందుకోసం ఏమైనా చేస్తారు. ఓట్లను రకరకాలుగా కొనుగోలు చేస్తారు. నేరుగా డబ్బులిస్తారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇస్తారు. ప్రభుత్వం వచ్చాక ఇస్తామని చెబుతారు. ఇలా ఓట్లను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు నేరుగా నగదు బదిలీ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. చివరికి రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు కూడా నగదే ఇస్తామంటున్నారు. కిలో రెండుకు ఇచ్చే బియ్యానికీ డబ్బులే ఇస్తామంటున్నారు. అంటే.. అసలు ఆయా పథకాల ఉద్దేశం ఏమిటో కూడా పాలకులు తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపే ముఖ్యం. వారికి ప్రజల దుస్థితి పట్టదు. భవిష్యత్‌ గురించి ఆలోచన ఉండదు. వారికి అధికారం కావాలి. అందు కోసం ఏమైనా చేస్తారు. ఆదాయం ఎంత..? అప్పులు ఎంత ? సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టగలం అన్న ఆలోచనలు అసలు చేయరు. ప్రభుత్వ.. ప్రజా ఆస్తులు తెగనమ్మి.. తాకట్టు పెట్టి కావాలంటే పది శాతానికిపైగా వడ్డీకి తెచ్చి తమ పేరుతో పెట్టుకునే పథకాలకు నగదు బదిలీ చేస్తారు.

ప్రజలపైనే భారం..
ప్రభుత్వం ఇలా ఉచిత పథకాల పేరుతో ధనం వెదజల్లుతుంటే, ఆ మొత్తాన్ని సాధారణ పౌరులే తిరిగి చెల్లించాలి. ఎప్పుడు పన్నులు ధనవంతులే చెల్లించరు, పేదవారు కూడా చెల్లిస్తారు. వారు కొనే అగ్గిపెట్టెలపై కూడా పన్ను ఉంటుందనే సంగతి వారికి తెలియదు కానీ.. అది నిజం. కానీ వారికి అవగాహన ఉండదుం ఉన్న వారికి మతం.. కులం మత్తు ఎక్కించారు. అందుకే పాలకులకు తిరుగులేకుండా పోయింది. ఉన్నదంతా దోచేసుకుని చిప్ప చేతిలో పెట్టి అందులో పది రూపాయలు వేస్తే అదే మహాద్భాగ్యం అనుకునే స్థితికి ప్రజల్ని తీసుకు వచ్చారు. ఇప్పుడు పాలకులు విశ్వరూపం చూపిస్తున్నారు. కానీ దేశానికి ఏ గతి పట్టించారో మాత్రం చూసుకోవడంం లేదు. రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థపైనే కాదు.. ఓ తరాన్ని నిర్వీర్యం చేస్తుంది ! ఉచిత పథకాలు ప్రజలపై తప్పుడు ప్రభావం చూపిస్తాయి. ఎప్పుడు ప్రభుత్వం ఉచితానుచితాలు ఇస్తుందా అని ఎదురుచూస్తు కష్టపడటం మానేసే రోజులు వచ్చేశాయి. యువశక్తి నిర్వీర్యం అయిపోయింది. ప్రభుత్వం అన్నీ సమకూర్చుతోంది కదా తాము ఎందుకు కష్టపడాలన్న ఆలోచనకు మెజార్టీ యువత వస్తున్నారు. ఇది ప్రమాదకర పరిణామం. ఈ పరిస్థితి ఇలా పెరిగిపోతే.. దేశంలో పని చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది. ప్రభుత్వంపై ఆధారపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. తమపై ఆధారపడేవారికిం కడుపు నింపితే చాలు తమకు ఓట్లేస్తారని రాజకీయ పార్టీలు సంబరపడవచ్చు కానీ.. అది రాజకీయ నాయకులుగా వారి బాధ్యతల్ని ఘోరంగా విస్మరించి.. దేశానికి ద్రోహం చేసినట్లవుతుంది. కానీ అలాంటి ద్రోహాల గురించి ఆలోచించే నేతలు ఇప్పుడు లేరు. రాజకీయ నేతల ఆలోచనల్లో మార్పు రావాలి. ఉచితాల గురించి ఆలోచించాలి. మార్పులు చేసుకోవాలి. అలాంటి ఆలోచనలు వారు చేసినప్పుడే దేశం నిలబడుతుంది. ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుంది. లేకపోతే.. అధోగతికి పయనిస్తూనే ఉంటుంది.

Also Read: Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ.. రాజగోపాల్ రెడ్డి బాటలో దాసోజు శ్రావణ్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular