పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొలదీ అక్కడి రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా వలసలు కామన్. ఇప్పుడు పశ్చిమబెంగాల్‌లోనూ అదే జరుగుతోంది. ఇప్పటికే బీజేపీలోకి భారీగా వలసలు రాగా.. ఇంకా ఆ వలసలు ఆగడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు సహా చాలావరకు తృణమూల్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిపోతున్నారు. చివరకు కమ్యూనిస్టులు కూడా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇది కాస్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే.. ఎన్నికలకు ముందు ఈ ఫిరాయింపులు ఏ పార్టీకి ఏ మేరకు లాభిస్తాయా అనేది ఆసక్తిగా మారింది.
Also Read: కాంగ్రెస్ లో సంచలనం: టీపీసీసీ చీఫ్ గా జీవన్ రెడ్డి?
టీఎంసీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలు, మంత్రులకు తిరిగి టిక్కెట్లు కేటాయిస్తామని బీజేపీ హామీ ఇస్తూ వస్తోంది. గతంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో ఇద్దరు తప్ప అందరూ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. అలాగే మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లోనూ జంప్ చేసిన ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున గెలుపొందారు. దీనిని బీజేపీ హైలెట్ చేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక.. కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉండటంతో జంప్ చేసిన ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికవుతున్నారు. అది సహజం. అధికార పార్టీకి చెందిన క్యాండిడేట్లు కాబట్టి ఉప ఎన్నికల్లో ఆ అడ్వాంటేజీ అందరికీ ఉంటుంది. ఇక ఆ రెండు రాష్ట్రాల్లోనూ అదే జరిగింది. కానీ.. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్నవి ఉప ఎన్నికలు కావు. ఇక్కడ సాధారణ ఎన్నికలే. కానీ.. ఈ ఎన్నికల్లో జంప్ జిలానీలకు రాజకీయంగా ఏ మేరకు మేలు జరుగుతుందా అని అందరిలోనూ కలిగే ప్రశ్న.
Also Read: వ్యాక్సిన్ ఫైట్.. క్రెడిట్ కోసం పరువు తీసుకుంటున్నారు
ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌ను బలహీన పరచాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అందుకే పెద్ద సంఖ్యలో ఈ జంప్ జిలానీలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 9 మంది ఎమ్మెల్యేలకు కాషాయ కండువా కప్పేసింది. వీరందరికీ స్పష్టమైన హామీ బీజేపీ అధినాయకత్వం నుంచి లభించినట్లు తెలిసింది. అయితే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సాధారణ ఎన్నికల్లో విజయం అంత సులువు కాదని గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో స్పష్టమైంది. దీంతో జంప్ చేసిన ఎమ్మెల్యేలకు మాత్రం గెలుపు ఫీవర్ వదిలిపెట్టడం లేదట. మమత బెనర్జీ మాత్రం బీజేపీలో చేరిన తమ నేతలపై గట్టి పోటీ ఉండేలా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మాత్రం నువ్వా నేనా అన్నట్లుగా మారుతున్నాయి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్