ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర బీజేపీ నాయకులు పిలుపునిచ్చిన ‘చలో రామతీర్థం’ ఉద్రిక్తంగా మారింది. రామతీర్థానికి వెళ్లేందుకు బీజేపీ నాయకులు యత్నించగా పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే కొందరు నాయకులను పోలీసులు హౌజ్ అరెస్టు చేయగా మరికొందరు పోలీసుల నుంచి తప్పించుకొని రామతీర్థం వెళ్లారు. అయితే రామతీర్థంలో సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీ నిర్వహించకూడదని, ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకులను అరెస్టు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది.