ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. అవే గెలుపు తీరాలకు చేరుస్తాయని ధీమాగా ఉన్నారు. దీంతో అప్పు చేసైనా సంక్షేమ పథకాల కొనసాగింపుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేయాలని కలలు కంటున్న జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. నగదు బదిలీ పథకాలతోనే ప్రజలు ఓట్లు వేస్తారని భావిస్తూ వాటిని సుదీర్ఘకాలం కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు.
కేరళ, బెంగాల్ లే ఆదర్శంగా..
కేరళలో విజయన్, పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ పదే పదే గెలుస్తూ ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటున్నారు. వారి పద్ధతులను గమనించిన జగన్ వారి బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నారు. సంక్షేమ పథకాల అమలుకు పక్కాగా ప్రణాళికలు రచిస్తూ ప్రజామోదాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు. దీని కోసం ఎంతటి కష్టమైన భరిస్తూ ప్రజలకు లాభం చేకూర్చడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు.
రెండేళ్లు నడిపినా..
జగన్ ప్రభుత్వం రెండేళ్లు కొనసాగినా ఇంకా మూడేళ్ల కాలం మిగిలే ఉంది. దీంతో ప్రభుత్వాన్ని నడపడం అంత సులభమేమీ కాదు. ఇప్పటికే అప్పులు చేసి కాలచక్రం నడిపినా ప్రస్తుతం కష్టమే. మూడేళ్ల పాటు ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే అప్పులు ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను, ఆస్తులను అమ్మడం ద్వారా ప్రజలకు ఏ లోటు రాకుండా చూసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇందు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అధికారులను సమాయత్తం చేస్తున్నారు. పథకాల అమలులో తేడా రావొద్దని సూచిస్తున్నారు.
నమ్మకం నిలబెడుతుందా?
సంక్షేమ పథకాలే విజయ తీరాలకు చేర్చుతాయని జగన్ పెట్టుకున్న నమ్మకం ఏ మేరకు విజయం సాధిస్తుంది. 1989లో ఎన్టీఆర్ కూడా ఇలాగే సంక్షేమ పథకాలను నమ్ముకున్నా ఓటమి పాలయ్యారు. ప్రజలు విశ్వాసం పెట్టి ఓట్లు వేస్తే విజయం లేదంటే అపజయమే. ఏది ఏమైనా ఏపీ సీఎం జగన్ సంక్షేమ బాట ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.