డాక్టర్లూ.. కాసులు కాదు..మానవత్వం చూపండి!

వైద్యుడు దేవుడితో సమానం అంటారు… నిజమే మన కళ్లకు కనిపించని ఆ దేవుడికన్నా.. మన ముందున్న డాక్టర్లే మనకు దేవుళ్లు… మా తాత ఇప్పటికీ చెబుతుంటాడు ఎనుకట గిసోంటి రోగాలెక్కడియిరా.. ఏమన్న రోగమో నొప్పో అత్తే బొప్పు రాయమల్లు తాత దగ్గరికి పోతే గోలీలు తయారుజేసిత్తుండే…(పాపం ఇటీవలనే బొప్పు రాయమల్లు తాత కాలం జేసిండు.. దాదాపు 93 సంవత్సరాల వరకు బతికిండు).. గవ్వేసుకోంగనే రెండు రోజులల్ల పనులకు పోయేటోళ్లం.. అవసరమైతే సూది కూడా వేస్తుండే.. ఏమన్న ఇత్తే […]

Written By: NARESH, Updated On : May 9, 2021 9:10 am
Follow us on

వైద్యుడు దేవుడితో సమానం అంటారు… నిజమే మన కళ్లకు కనిపించని ఆ దేవుడికన్నా.. మన ముందున్న డాక్టర్లే మనకు దేవుళ్లు… మా తాత ఇప్పటికీ చెబుతుంటాడు ఎనుకట గిసోంటి రోగాలెక్కడియిరా.. ఏమన్న రోగమో నొప్పో అత్తే బొప్పు రాయమల్లు తాత దగ్గరికి పోతే గోలీలు తయారుజేసిత్తుండే…(పాపం ఇటీవలనే బొప్పు రాయమల్లు తాత కాలం జేసిండు.. దాదాపు 93 సంవత్సరాల వరకు బతికిండు).. గవ్వేసుకోంగనే రెండు రోజులల్ల పనులకు పోయేటోళ్లం.. అవసరమైతే సూది కూడా వేస్తుండే.. ఏమన్న ఇత్తే తీసుకుంటుండే లేకపోతే లేదు అంటుంటాడు.. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా తాత చెప్పే మాటలు వింటుంటే ఒకప్పుడు మంచి, మానవత్వం, సహాయగుణం మాటల్లో చెప్పలేనివిధంగా ఉండేదేమో అని అనిపిస్తోంది.

కానీ ఈ రోజుల్లో మంచికి, మానవత్వానికి, మనిషికి లేని విలువ ‘మనీ’కి మాత్రమే ఉందనడంలో సందేహం లేదు.. ఎందుకంటే ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్న కరోనా బాధితుడిని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తే అతడి కండీషన్ చూసి హుటాహుటిన వైద్యం అందించాల్సిన దేవుళ్లు(డాక్టర్లు) ముందే చెబుతారు రోజుకు ఇన్నివేలు ఖర్చవుతాయి, ఇష్టముంటే అడ్మిట్ చేయండి లేకపోతే తీసుకెళ్లండి అని… దీంతో దిక్కు తోచని స్థితిలో ఏం చేయాలో తెలియక తమవారిని దక్కించుకోవడానికి అప్పోసప్పో జేసి నానా తిప్పలు పడుతున్నారు.. అటువంటి వారి అవసరాన్ని అవకాశంగా తీసుకొని కొన్ని ఆస్పత్రులు లక్షల రూపాయల్లో ఫీజులను వసూలు చేస్తున్నాయి.. ఇక్కడ వారు చెప్పినంత మనీ ఇస్తేనే మనిషి బ్రతుకుతాడన్న మాట..

మరో వైపు లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు.. వ్యాపారాలు దెబ్బతిన్నాయి.. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమయింది.. దీంతో కుటుంబాలను పోషించడమే కష్టంగా మారింది. ఇటువంటి సమయంలో కరోనా రక్కసి కాటు వేయడంతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారుతోంది పరిస్థితి. కాబట్టి ఈ కష్టకాలంలో ప్రభుత్వానికే కాదు ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలకు, ప్రైవేట్ వైద్యులకు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. సర్కారు దవాఖానాల్లో సరైన వైద్య సదుపాయాలు కల్పించలేని, వైద్య సిబ్బందిని సరిపడా నియమించలేని ప్రభుత్వాలకు ఈ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు మానవతా దృక్పథంతో పేద ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఎందుకంటే ప్రజలు మిమ్మల్నే దేవుళ్లుగా భావించి మీ పైనే భారం పెడతారు కాబట్టి.

కరోనా బాధితులను కాపాడే తరుణంలో, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ప్రైవేట్ ఆస్పత్రులు ప్రజల రక్తాలను తాగే రాక్షసులుగా మారకుండా కాస్త మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
-కే.శంకర్