వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. నిజానికి జగన్ వరుస ఎన్నికల్లో విజయం సాధించడంలో ఈ పథకాల పాత్ర కూడా చాలా ఉందన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు ఆ సంక్షేమానికి ఎగనామం పెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా.. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
వైసీపీ పథకాల్లో ‘జగనన్న విద్యాదీవెన’ ఒకటి. ఈ పథకం కింద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లిస్తున్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ మొదటి విడత నగదును ఆన్ లైన్ ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేశారు. అయితే.. ఈ నిధుల విషయంలోనే ప్రభుత్వం చేసిన తొండి బయటపడిందని అంటున్నారు.
ఈ పథకం కింద విడుదల చేసిన నిధులు ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించినవి కాదట! ఆయా సామాజిక వర్గాల సంక్షేమం కోసం కేటాయించాల్సిన నిధులనే.. ఇటు మళ్లించారని సమాచారం. దీనిపై లబ్ధిదారులు నెత్తీనోరూ కొట్టుకుంటున్నట్టు సమాచారం. తమ డబ్బులను విద్యార్థులకు కేటాయిస్తే.. తమ పరిస్థితి ఏంటని అడుగుతున్నారట.
జగనన్న విద్యాదీవెన కింద.. బీసీ కోటా విద్యార్థులకు రూ.491 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు 119 కోట్లు, ఎస్టీ విద్యార్థులకు 19 కోట్లు, మైనారిటీ విద్యార్థులకు 41 కోట్లు విడుదల చేశారు. కానీ.. ఇవన్నీ ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారికి వ్యక్తిగతంగా అందాల్సిన నిధులట. వీటినే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ కింద చెల్లింపులు చేశారట.
ఇలా చేయడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్న ఎదురవుతోంది. సామాజిక వర్గాలకు చెల్లించాల్సిన నిధులను అందకుండా చేయడం ఎక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారట. మరి, దీనికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.