Wayanad Land Slide : అయిన వాళ్లందర్నీ కోల్పోయిన ఆమె జీవితంలో మరో దారుణం.. వయనాడ్ శృతి జీవితంలో గుండెలు పగిలే విషాదం

సరిగ్గా 2 నెలల క్రితం.. ఆమె జీవితం పూలవనం. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో సరదాగా కాలం గడిచిపోయేది. నచ్చినవాడితో త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకుంది. ఇక త్వరలో పెళ్లి భాజాలు మోగుతాయి అనుకుంటున్న తరుణంలో చోటుచేసుకున్న వరదలు ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేశాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 12, 2024 11:58 am

Wayanad Sruthi

Follow us on

Wayanad Land Slide : ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రాంతంలో వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వయనాడ్ జిల్లా చూరాల్ మల గ్రామానికి చెందిన శృతి తన కుటుంబంలోని 9 మంది సభ్యులను ఒకేసారి కోల్పోయింది. కుటుంబ సభ్యులను కోల్పోవడంతో ఆమె గుండెలు పగిలేలా రోదించింది. చివరికి ఈ విషయంపై ఏ మంత్రి పినరై విజయన్ కూడా స్పందించారు. బాధిత యువతకి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమె జీవితంలో చోటు చేసుకున్న విషాదం పట్ల ఆయన కూడా కన్నీటి పర్యంతమయ్యారు. శృతి ఇప్పుడిప్పుడే గుండె ధైర్యాన్ని పెంచుకొని జీవితంలో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో విధి ఆమెపై మరోసారి పగబట్టింది. ఈసారి తన జీవితాంతం తోడునీడగా ఉంటాడనుకుంటున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. అటు కుటుంబ సభ్యులను, ఇటు ప్రేమించిన వాడిని కోల్పోయి గుండెలు పగిలేలా రోదిస్తోంది.

రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది

చూరాల్ మల గ్రామానికి చెందిన శృతి, జెన్సన్(27) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి మతాలు వేరైనప్పటికీ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అర్థం చేసుకొని వివాహానికి అంగీకరించారు. జూన్ 30న వయనాడ్ ప్రాంతంలో సంభవించిన వరదలు శృతి జీవితాన్ని సర్వనాశనం చేశాయి. వరదలు చుట్టుముట్టి.. కొండ చరియలు విరిగిపడటంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, ఇతర కుటుంబ సభ్యులు మొత్తం తొమ్మిది మంది చనిపోయారు. ఈ కష్టకాలంలో జెన్సన్ ఆమెకు తోడునీడగా నిలిచాడు. ఆపత్కాలంలో తన ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. ఆమె వెంటే ఉన్నాడు. వరద ప్రాంతాల సందర్శనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు వీరిద్దరూ కలిసి ఆయనతో మాట్లాడారు. అప్పట్లో జాతీయ మీడియా సైతం వారిద్దరి గుండెని నిబ్బరాన్ని గుర్తించింది.. ప్రత్యేకమైన కథనాలను ప్రసారం చేసింది. శృతి ఆమె కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించేందుకు స్మశాన వాటికకు వెళ్ళినప్పుడు.. జెన్సన్ కూడా ఆమె వెంట ఉన్నాడు. ఆమె కడదాకా తోడు ఉంటానని ప్రమాణం చేశాడు. ఈ క్రమంలో ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సెప్టెంబర్ లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామని ప్రకటించారు. కానీ ఈ లోగానే శ్రుతి జీవితంలో మరో దారుణం చోటుచేసుకుంది. అయిన వాళ్లందరినీ కోల్పోయిన ఆమె.. మరో పిడుగు లాంటి వార్తను వినాల్సి వచ్చింది. శృతికి కాబోయే భర్త జెన్సన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. సెప్టెంబర్ 10న శృతి, జెన్సన్, మరో కొంత మంది కుటుంబ సభ్యులు వేరే ఊరు వెళ్లడానికి బయలుదేరారు. ఈ కాలంలో వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని కోజికోడ్ – కొల్లెగల్ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో జెన్సన్ తీవ్రంగా గాయపడ్డాడు. మిగతా కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు. జెన్సన్ కు చికిత్స అందిస్తుండగా బుధవారం రాత్రి చనిపోయాడు. దీంతో శృతి జీవితం మరింత తలకిందులుగా మారిపోయింది. అటు అయిన వారిని కోల్పోయి జీవితమంతా చీకటిగా మారితే.. కడదాకా తోడు ఉంటానని జెన్సన్ మాట ఇచ్చాడు. అతడు ఇచ్చిన బలంతో జీవితం పై సానుకూల దృక్పథాన్ని పెంచుకుంటున్న క్రమంలో… రోడ్డు ప్రమాదం జెన్సన్ ను బలి తీసుకుంది. దీంతో శృతి జీవితంలో గాఢాంధకారం అలముకుంది.