గత సంవత్సర కాలంగా ఎంతో స్నేహంగా ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అకస్మాత్తుగా జలవివాదాలతో రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఉద్వేగాలు రెచ్చగొట్టి, ఇప్పుడు అపెక్స్ కమిటీ సమావేశం అనేసరికి వణికి పోతున్నారు. కేంద్ర జలవనరుల మంత్రి జరిపే ఈ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పాల్గొనవలసి ఉంటుంది.
ఈ సమావేశం జరిగితే తమ బండారం బైటపడుతుందని, ప్రజల ముందు పరువు పోతుందని వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే అపెక్స్ కమిటీ సమావేశం జరగకుండా చేయడం కోసం, తామే ముందుగా కలసి, తమ మధ్య విబేధాలు లేవని చెప్పాలని అనుకొంటున్నట్లు చెబుతున్నారు.
ఇప్పుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాయలసీమలో ప్రతిపాదిస్తున్న పధకాలు అన్ని ప్రజాకర్షణ కోసమే గాని, నిజాయతి లేదనే విమర్శలు ఇప్పటికే రాయలసీమ నేతల నుండి వస్తున్నాయి. అదే విధంగా దక్షిణ తెలంగాణాలో అమలులో ఉన్న సాగునీటి పధకాలను వదిలి పెట్టి కేసీఆర్ వచ్చినప్పటి నుండి ఉత్తర తెలంగాణ ప్రాజెక్ట్ లపై దృష్టి సారిస్తున్నట్లు తెలంగాణాలో విమర్శలు చెలరేగుతున్నాయి.
పైగా, రాయలసీమ, దక్షిణ తెలంగాణాలలో చెబుతున్న ప్రాజెక్ట్ లు అన్ని నిబంధనలు ఉల్లంఘించి, అక్రమంగా చేపట్టినవి అని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం కృష్ణ బోర్డు ముందు చేసుకున్న ఆరోపణలు స్పష్టం చేస్తున్నాయి. అపెక్స్ కమిటీ ముందుకు వెడితే సాధించేది ఏమీ లేకపోగా, తమ లోటుపాట్లే బయటపడతాయని ఇప్పుడు గ్రహించినట్లున్నది.
అందుకనే అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఎగగొట్టేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. నేరుగా జగన్ తో మాట్లాడడం ద్వారా ఆ సమావేశం అవసరం లేకుండా చేయాలని అనుకొంటున్నట్లు చెబుతున్నారు. దానితో త్వరలో మరోసారి జగన్ ప్రగతి భవన్ కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే మూడు సార్లు ఈ ముఖ్యమంత్రులు కలిసినా నిర్దుష్టంగా ఎటువంటి నిర్ణయానికి రాలేక పోవడం గమనార్హం. సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తే అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 2015లో ఆ విధంగా నాటి కేంద్ర జలవరణుల మంత్రి ఉమా భారతి చంద్రబాబు నాయుడు ఫిర్యాదుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరెప్పుడు జరగలేదు.
కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కాకుండా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేసిన ఫిర్యాదుపై అపెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటుకు నిర్ణయించారు. దానితో రాజకీయంగా కూడా తామిద్దరికి ఇబ్బందికరం కాగలదని కేసీఆర్ జగన్ ను వారించే అవకాశం కనిపిస్తున్నది.