Janasena: విశాఖలో వైసీపీ విధ్వంసం వెనుక జనసేనకు ముందే సమాచారం ఉందా? ఎయిర్ పోర్టు ఎపిసోడ్ పక్కా ప్లాన్ తో జరిగిందా? పవన్ పై దాడికి వ్యూహం పన్నారా? అధికార పార్టీకి చెందిన కీలక నేత ఇంట్లో ప్రణాళిక రూపొందించారా? కానీ జనసేనాని వ్యూహాత్మక మౌనంతో అది బెడిసికొట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జనసేన పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో వీటిన్నింటిపై అధినేత శ్రేణులకు క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి జనసేన విశాఖలో జనవాణి కార్యక్రమం చాలా రోజుల కిందటే ఫిక్స్ అయ్యింది. కొన్ని సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చేది. చివరకు అక్టోబరు 16న నిర్వహణకు సిద్ధమయ్యారు. వేదికను ఖరారు చేయడంతో పాటు ఉత్తరాంధ్ర పార్టీ శ్రేణులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర లక్ష్య దిశగా సాగుతోంది. ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. అయితే దానికి విరుగుడుగా ఉత్తరాంధ్ర కృత్రిమ ఉద్యమం వైసీపీ నేతల్లో పురుడుపోసుకుంది. ప్రజాప్రతినిధుల రాజీనామా అస్త్రాన్ని బయటకు తీశారు. అప్పటికప్పుడు అక్టోబరు 15న విశాఖ గర్జనకు పిలుపునిచ్చారు. అదే రోజున టీడీపీ సేవ్ విశాఖ పేరిట రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా పిలుపునిచ్చింది.

అయితే ఇక్కడ టీడీపీ కార్యక్రమాన్ని విడిచిపెట్టి.. పవన్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. తాము విశాఖ గర్జన చేపడుతున్న నేపథ్యంలో పవన్ ను విశాఖలో అడుగుపెట్టనీయ్యకూడదని చూశారు. పవన్ వస్తే విశాఖ గర్జనకు దీటుగా జనసైనికులు, అభిమానులు హాజరయ్యే చాన్స్ ఉన్నందున అడ్డుకోవాలని చూశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కానీ వీలుపడకపోవడంతో విధ్వంసానికి పతక రచన చేశారు. అయితే కేంద్ర నిఘా వర్గాలు ఈ విషయాన్ని పసిగట్టాయి. పవన్ పై వ్యక్తిగత దాడి జరుగుతుందని హెచ్చరించాయి. ఇందు కోసం విశాఖ కేంద్రంగా ప్లాన్ జరుగుతుందని చెప్పుకొచ్చాయి. కానీ పవన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. విశాఖలో అడుగుపెట్టారు. వైసీపీ ప్లాన్ ప్రకారం.. ఎయిర్ పోర్టులో కవ్వింపు చర్యలు ప్రారంభమయ్యాయి. అటు పవన్ పర్యటనపై ఆంక్షలు పెరిగాయి. జనవాణి కార్యక్రమం సైతం రద్దయ్యింది. అయితే పవన్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ పోలీసులకు సహకరిస్తూ వ్యూహాత్మకంగా రెండు రోజుల పాటు హోటల్ కే పరిమితం కావడంతో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిచ్చారు. తద్వారా వైసీపీ ప్లాన్ వర్కవుట్ కాలేదు.

పవన్ కు ఇప్పటివరకూ వైసీపీ నుంచి మాటల దాడే ఎదురైంది. కానీ ఫస్ట్ టైమ్ భౌతిక దాడికి ప్లాన్ చేశారని తెలియడంపై జనసైనికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో పవన్ ఏకంగా వీడియోలు ప్రదర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తుని రైలు దగ్ధం ఘటన నుంచి మొన్నటి విశాఖ ఎయిర్ పోర్టు ఘటన వరకూ విధ్వంసాల్లో వైసీపీ పాత్ర ఉందని పవన్ ఉదాహరణలతో సహా జనసేన నాయకులకు వివరించారు. ఈ పరిణామాల క్రమంలోనే తాను వైసీపీ గుండాగిరీపై యుద్ధం ప్రకటించానని కూడా చెప్పారు. వైసీపీ విధ్వంసాలపై కేంద్ర నిఘా సంస్థల వద్ద సమగ్ర సమాచారం ఉందని కూడా చెప్పారు. మొత్తానికైతే విశాఖ ఎపిసోడ్ లో వైసీపీ చాలా ప్లాన్ లు రూపొందించింది. కానీ పవన్ తన వ్యూహాత్మక మౌనంతో వాటన్నింటినీ పటాపంచలు చేశారన్నమాట.