Warangal: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు నిధులు విడుదల చేశారు. ఈ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి స్వయంగా సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల నిధులు మంజూరు చేశారు. దాంతో జిల్లా ప్రజానీకం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇక పనులకు సైతం చకచకా అడుగులు పడుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆస్పత్రి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తంగా చారిత్రక వరంగల్ నగరాన్ని హెల్త్ హబ్‌గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ విషయాలపై ఫోకస్..
ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.1,100 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది. ఇక కేసీఆర్ అనుకుంటున్న ఆరోగ్య తెలంగాణ లక్ష్యం కోసం మంత్రి హరీశ్ అహర్నిశలు పని చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి నిర్మాణాలు స్టార్ట్ చేయాలని మంత్రి హరీశ్ అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నలువైపులా నిర్మించే నాలుగు టిమ్స్ ఆస్పత్రుల మాదిరిగా గ్రామీణ ప్రాంత ప్రజల అవసరాల కోసం వరంగల్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే వరంగల్‌లో 8 న్యూ మెడికల్ కాలేజెస్ నిర్మించాలని, ఇందుకు సంబంధించిన విషయాలపై బీఆర్‌కే భవన్‌లో ఆరోగ్య, రోడ్లు, భవనాల శాఖ అధికారులతో మంత్రి హరీశ్ సమీక్ష నిర్వహించారు.
Also Read: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. బియ్యం స్కాం బయటపడనుందా?
ఒకసారి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పూర్తయితే వరంగల్ సిటీ రాష్ట్రానికే మెడికల్ హబ్‌గా మారుతుందని మంత్రి హరీశ్‌రావు అంటున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ రూల్స్ ప్రకారమే మెడికల్ కాలేజెస్ కన్‌స్ట్రక్ట్ చేయాలని అధికారులకు మంత్రి హరీశ్ సూచించారు. ప్రతీ పేద బిడ్డకు నాణ్యమైన వైద్య సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, అందుకు అనుగుణంగానే ఆధునిక పద్ధతులతో మెరుగైన సదుపాయాలు ఉండేలా ఆస్పత్రిని రూపొందించాలని అధికారులకు మంత్రి హరీశ్ దిశానిర్దేశం చేశారు. 2,000 వేల పడకల సామర్థ్యంతో 24 అంతస్తులతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఇక ఈ దవాఖానాలో 36 విభాగాలు పని చేస్తాయని, దాదాపు 500 మంది డాక్టర్స్, 1,000 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బంది ఈ ఆస్పత్రిలో పని చేయనున్నారు. ఇక ఈ ఆస్పత్రి ప్రాంగణంలోనే అత్యవసర సమయాల్లో హెలికాప్టర్ ల్యాండ్ అయేలా ఏర్పాట్లు చేయనున్నారు.
Also Read: జర్నలిస్టుల విషయంలో తెలంగాణే నయం..!