KCR vs BJP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విచారణ సంస్థలతో సాగిస్తున్న ప్రతీకార దాడులతో తెలంగాణలో రాజకీయం రగులుతోంది. దీనిని పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈమేరకు డిసెంబర్‌లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సూచించారు. అసెంబ్లీ వేదికగా కేంద్రం రాష్ట్ర అప్పులపై విధించిన ఆంక్షలను ఎండగడుతూ తీర్మానం చేయడానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. రాష్ట్రాలతో కేంద్ర వ్యవహరిస్తున్న తీరుపై కూడా చర్చకు నిర్ణయించారు. అదే సమయంలో గవర్నర్ తీరుపైనా తీర్మానం చేసేందుకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.

అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని టార్గెట్ చేయాలని..
కేంద్ర ప్రభుత్వ తీరును ఎత్తిచూపడానికి డిసెంబర్‌లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రానికి వివిధ మార్గాల కింద రావాల్సిన నిధులను డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర సర్కారు విధించిన ఆంక్షల కారణంగా రూ.40 వేల కోట్ల మేర నష్టపోయామని తెలంగాణ మంత్రులు వివరిస్తున్నారు. 14, 15 ఆర్థిక సంఘాలు చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లను విడుదల చేయడం లేదనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్రంపై సుప్రీంలో కేసు దిశగా..
అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ జరుపనున్నారు. సభ్యులు కేంద్రం తీరును ఎండగడుతూ వాస్తవాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రభుత్వ నిర్ణమయం. అదే సమయంలో కేంద్రం తీరును నిరసిస్తూ అసెంబ్లీ వేదికగా జరిగే చర్చను తీర్మానం రూపంలో కేంద్రానికి పంపాలని భావిస్తున్నారు. కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రాష్ట్రానికి 41 శాతం మేర నిధులు రావాల్సి ఉండగా.. ప్రత్యేక సెస్‌ల విధింపుతో రాష్ట్రాల వాటాను 29 శాతానికే పరిమితం చేస్తోందని రాష్ట్ర సర్కారు పలుమార్లు ప్రస్తావించింది. రాష్ట్రాలకు రాజ్యాంగపరంగా రావాల్సిన వాటా అని, అయినా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను దగా చేస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాల పైన అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ – ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రజలకు వివరించేందుకు నిర్ణయించారు. కేంద్ర ఆంక్షల కారణంగా రాష్ట్రం ఏ మేరకు నష్టపోయిందో తెలియజేయాలని భావిస్తున్నారు. తీర్మాన కాపీని కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోతే.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల సలహాలు స్వీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గవర్నర్ తీరుపై అసెంబ్లీలో తీర్మానం..??
అసెంబ్లీ వేదికగా గవర్నర్‌పైన తీర్మానం దిశగా కసీఆర్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపని అంశంపైనా మరో తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించి.. గవర్నర్ సమ్మతి కోసం పంపింది, ఇందులో ఒక్క జీఎస్‌టీ సవరణ బిల్లును మాత్రమే ఆమోదించిన గవర్నర్ మిగతా 7 బిల్లులనూ పెండింగ్‌లోనే పెట్టారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఆర్టికల్ 200లో ఉన్న ‘యాజ్ సూన్ యాజ్ పాసిబుల్’ అనే పదాన్ని తొలగించి, 30 రోజుల గడువు పెట్టేలా రాజ్యాంగాన్ని సవరించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈమేరు మరో తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని.. దానిని కూడా కేంద్రానికి పంపాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది.