KCR- BL Santhosh: బీజేపీ అగ్రనేతను తెలంగాణ పోలీసుల ముందుకు రప్పించి విచారణ చేసి.. అవసరమైతే అరెస్ట్ చేసి జాతీయ స్థాయిలో బీజేపీని ఎదురించే నాయకుడు అనిపించుకోవాలనుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యూహం బెడిసి కొట్టింది. బీజేపీలో నంబర్ త్రీగా ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్‌ను తమ ఎదుట హాజరయ్యేలా తెలంగాణ సిట్ చేసిన ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఆయనకు జారీ చేసిన నోటీసులపై స్టే విధించింది. ఇంతకు ముందు బీజేపీ తరఫున ఆయనకు నోటీసులు జారీ చేయడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన విచారణకు హాజరైతే ఇబ్బందేమిటని ప్రశ్నించింది. హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఈ సారి బీఎల్.సంతోష్ స్వయంగా పిటిషన్ వేసి రిలీఫ్ తెచ్చుకున్నారు.

ఫిర్యాదులో పేరే లేదు.. నిందితుడు ఎలా అవుతాడు..
అసలు ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదులో బీఎల్.సంతోష్ పేరు లేదని.. అలాంటప్పుడు ఆయన పేరును నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్.సంతోష్ పాత్రపై పూర్తిస్థాయి ఆధారాలున్నాయని సిట్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. నోటీసులపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణను డిసెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది.
28న రావాలని మళ్లీ నోటీసులు..
సిట్ అధికారులు బీఎల్.సంతోష్‌కి 41 ఏ సీఆర్‌సీపీ కింద
గురువారమే రెండోసారి నోటీసులు జారీ చేశారు. 28వ తేదీన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈసారి హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామన్న సంకేతాలు పపారు. బీఎల్.సంతోష్‌తోపాటు తుషార్, జగ్గుస్వామి వంటి వారికి నోటీసులు ఇచ్చినా ఎవరూ హాజరు కావడం లేదు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజుకు కూడా నోటీసులు జారీ చేశారు. ఆయన కూడా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

సిట్ దూకుడుకు బ్రేక్
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, ఆయన దిశా నిర్దేశం మేరకు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ సీవీ.ఆనంద్.. కేసీఆర్ ఇస్తున్న భరోసాతో దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో ఏ కేసు దర్యాప్తులో ప్రదర్శించనంత దూకుడు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో చూపుతున్నారు. కేసీఆర్ స్క్రిప్ట్ మేరకు బీజేపీ జాతీయ నాయకులను ఇందులో ఇరికించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నాయకులకు ఇందులో ప్రమేయం ఉన్నట్టుగా సిట్ భావిస్తూ విచారణకు హాజరు కావాలంటూ ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బండి సంజయ్ అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు ఇచ్చింది. కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామితోపాటు కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు జాతీయ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కూడా 41ఏ నోటీసులు ఇచ్చి ఈనెల 21న విచారణకు రావాలని సూచించింది. రాని పక్షంలో అరెస్ట్ చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా నందరుమార్ భార్య చిత్రలేక, బీజేపీ నాయకుడు భరత్‌కుమార్‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. వారు ఇచ్చిన సమాచారం మేరకు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే సంతోష్‌ను రప్పించే విషయంలో సిట్ ప్రదర్శిస్తున్న దూకుడుకు హైకోర్టు బ్రేక్ వేసింది.