పోలింగ్ సమయం దగ్గరపడే కొద్దీ.. మా ఎన్నికల వ్యవహారం మరింతగా రచ్చకెక్కుతోంది. నిన్నా మొన్నటి వరకూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యలను ప్రస్తావించిన వారు.. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటారు. కళాకారులను ఆదుకుంటామని, మా సంస్థకు బిల్డింగ్ వగైరా సౌకర్యాలు కల్పిస్తామన్న వారు కాస్తా.. ఇప్పుడు ఏకంగా దూషణలకు సైతం దిగుతున్నారు. తాజాగా.. ప్రకాష్ రాజ్-విష్ణు మరోసారి నువ్వా నేనా అంటూ మీడియా ముందు రచ్చ చేశారు.
పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంతో గొడవ తారస్థాయికి చేరింది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన డబ్బు చెల్లించడానికి మీరెవరు అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. ఇదంతా ఓట్లను మాయచేసే వ్యవహారంగా ఆయన చెప్పారు. దీన్ని సమర్థించుకున్నాడు విష్ణు. కొందరి సభ్యుల తరపున మేం డబ్బులు చెల్లిస్తే ఇబ్బంది ఏముందని చెప్పుకొచ్చాడు.
ప్రకాష్ రాజ్ ను టార్గెట్ చేస్తూ విష్ణు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మా ఫ్యామిలీ జోలికొస్తే.. మీ కుటుంబ విషయాలు బయటపెడతానంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. ఇప్పటి వరకు గౌరవంగా సంబోధించానని, ఇక మీదట అది ఉండదని కూడా చెప్పుకొచ్చాడు. అటు నరేష్ సైతం ఆజ్యం పోశాడు. ప్రకాష్‌రాజ్ మోసగాడని, ఓ నిర్మాతకు 7 కోట్ల మేర నష్టం చేశాడంటూ మీడియా ముందు వివరించాడు. అంతేకాదు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న జీవితను ఎల్ బోర్డు అంటూ వ్యాఖ్యానించాడు. మిగిలిన వారిపైనా కౌంటర్లు వేశాడు.
నిజానికి.. మా ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఏం చేస్తారు? అన్నదానికి సరైన సమాధానం లేదు. భారీగా నిధులు ఉన్నాయా అంటే అదీ లేదు. రెండేళ్లపాటు ఉండి దిగిపోయే ఓ చిన్న పదవి అంతే. ఇందులో మొత్తం సభ్యుల సంఖ్య తీస్తే.. తొమ్మిది వందల లోపే. దీనికే.. ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారు? అన్నప్పుడు కనిపిస్తున్న ఆన్సర్ ‘పరువు’.
ఒకసారి ఎన్నికల బరిలోకి దిగాం కాబట్టి.. ఇండస్ట్రీలో తమ పరువు నిలబడాలంటే.. ఈ ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే అనే నిర్ణయానికి వచ్చేసినట్టున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఒక చిన్నపాటి అసోసియేషన్ ఎన్నికకు ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా? అని ముక్కున వేలేసుకుంటున్నారు జనాలు.
