తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడిన ముఖ్య ఉద్దేశం నీళ్లు.. నిధులు.. నియామకాలు.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ పాలకుల చేతుల్లో తెలంగాణ యువతకు సరైన ఉద్యోగం, ఉపాధి దొరకడం లేదని కొట్లాడి తెచ్చుకున్నదే ఈ రాష్ట్రం. నీళ్లు, నిధుల విషయంలో ప్రస్తుతం పెద్దగా సమస్య లేకపోగా.. నియామకాల విషయంలో తెలంగాణ (Telangana) యువత ప్రస్తుత టీఆర్ఎస్ సర్కారుపై అసహనంగా ఉంది. ఎనిమిదేళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో కేవలం 80వేల ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా ఇవ్వలేదని స్థానిక యువత చెబుతుండగా.. లేదు.. లేదు.. మేము ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చామని, చాలా మందికి ఉపాధి కల్పించామని పాలకులు చెబుతున్న మాటలు. నోటిఫికేషన్లు.. కేవలం నోటిమాటలే తప్పా..పత్యక్షంగా వేయలని నిరుద్యోగ యువత గొంతెత్తి అరుస్తుండగా.. చదువుకున్న ప్రతీ ఒక్కరికి సర్కారు ఉద్యోగం ఎలా సాధ్యమవుతుందని గులాబీ ప్రభుత్వం చెబుతున్న మాట.
నిరుద్యోగుల ఆశలను తెలంగాణ సర్కారు ఆసరాగా తీసుకుంటోందని ఆరోపిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు. ఏళ్లకాలంగా ఎంతో ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్లకోసం ఎదుచూస్తే.. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ప్రకటనలు చేయడం తరువాత దాటవేయడం పరిపాటిగా మారిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఏవైనా ఎలక్షన్లు వచ్చాంటే మంత్రి హరీశ్ రావు.. త్వరలో 50వేల నోటిఫికేషన్లు అంటూ ప్రకటించడం.. కేటీఆర్ ఇప్పటికే చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు వేశాం.. త్వరలోనే మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతుండడం కేవలం నోటిమాటలుగానే మిగిలిపోతున్నాయని తెలంగాణ (Telangana) యువత చెబుతున్నారు. ఇంటికో ఉద్యోగం నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడా హామీనే మరిచిపోయిందని అంటున్నారు. 2018 ఎన్నికల తరువాత వచ్చిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంలోనూ ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రస్తావించిన టీఆర్ఎస్ పాలకులు ప్రస్తుత హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనూ ఉద్యోగ నోటిఫికేషన్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని అంటున్నారు తెలంగాణ నిరుద్యోగ యువత.
తెలంగాణ యువత ఏళకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు గురించి ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు వీరి మనసులో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. గతేడాది డిసెంబరులో ఢిల్లీకి వెళ్లివచ్చిన కేసీఆర్ వెంటనే ప్రగతి భవన్లో మీటింగ్ పెట్టారు. 50వేల ఉద్యోగాలంటూ ప్రకటన చేశారు. రెండుమూడు మాసాల్లోనే రిక్రూట్మెంటు జరుగుతుందని యువత కూడా ఆశగా ఎదురుచూశారు. కానీ నిరాశే మిగిలింది. జీహెచ్ఎంపీ ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్, నాగార్జున సాగర్లో కేసీఆర్ మరోసారి ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. రేపు.. మాపు అంటూ హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నోటిఫికేషన్ల జాడే లేదు. తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వచ్చే రెండు నెలల వ్యవధిలో 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామంటూ నిండు సభలో ప్రకటించేశారు. ఇదైనా నెరవేరుతుందా అంటూ యువత అయోమయంలో పడ్డారు.
మన రాష్ట్రం మనం కొట్టాడి తెచ్చుకున్నాం.. ఇక ఎంత చదివితే.. అంతమంచి ఉద్యోగం సాధించవచ్చని యువత ఉన్నత చదువులపై దృష్టి సారించింది. డిగ్రీలు పీజీలు పూర్తయినా.. ఖాళీగా ఉండకుండా… లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ల పేరిట కోచింగులు తీసుకుంటున్నారు. చాలా మంది ప్రయివేటు సెంటర్లలో కోచింగ్ తీసుకుంటుండగా.. ఆర్థికంగా లేనివారు ప్రభుత్వ లైబ్రరీల్లో చదువుకుంటూ.. ఐదు రూపాయల భోజనంతో కడుపునింపుకుంటూ.. ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ జీవనం సాగిస్తున్నారు. రేయింబవళ్లు చదువుపైనే దృష్టి పెట్టి.. వేరే ప్రయివేటు కొలువుకు అవకాశం వచ్చినా వెళ్లకుండా చేస్తే సర్కారు ఉద్యోగమే చేస్తానంటూ.. కుర్చీలకు అతుక్కుపోయి పుస్తకాల పురుగులుగా మారారు. యువత ఆశను..ఆశయాన్ని అవకాశంగా తీసుకుంటున్న ప్రభుత్వం నోటిఫికేషన్ల పేరిట ఎన్నికల స్టంట్ వేస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. చూడాలి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారైనా.. మాట నిలబెట్టుకుంటారా అని..
