PM Modi: భతర మాత సేవలో తరించాలని చాలామంది కలలు కంటారు. ఇందుకోసం కొంతమంది రాజకీయాలను ఎన్నుకుంటారు, ఇంకోందరు సివిల సర్వీసెస్‌లో చేరుతారు. చాలా మంది సైన్యంలో చేరుతారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న నరేంద్ర మోదీ కూడా సైనికుడై దేశ సేవ చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. కానీ, రాజకీయాల్లోకి వచ్చి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి ప్రధానిగా.. గ్లోబల్ ఫేమ్ దక్కించుకున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలను.. ప్రతీ చర్యనూ అంతే ఆసక్తిగా గమనిస్తుంటుంది మన దేశం. ఇవాళ మోదీ 72వ పుట్టినరోజు. నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ జీవితంపై ప్రత్యేక కథనం.
స్వతంత్య్ర భారత దేశంలో జననం..
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడేళ్లకు.. గణతంత్రంగా మారిన కొన్నినెలలకు నరేంద్ర మోదీ జన్మించారు. ఉత్తర గుజరాత్ మెహ్‌సనా జిల్లా వాద్‌నగర్‌లో 1950, సెప్టెంబర్ 17న దామోదర్ దాస్‌మోదీ, హిరాబా మోదీ దంపతులకు మూడో సంతానంగా జన్మించారు నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ. దామోదర్ దాస్‌మోదీ, హిరాబా మోదీ దంపతులకు ఆరుగురు సంతానం. తమది అట్టడుగు స్థాయి కుటుంబంగా చెప్పుకునే ఆయన.. తన చిన్నతనంలో తిండి కోసం పడ్డ కష్టాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. తన తల్లి ఇల్లు గడవడానికి నాలుగు ఇళ్లలో పని చేసేదని, తన తండ్రి స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్‌లో ఛాయ్ అమ్ముకుని జీవించేవారని, తానూ తన తండ్రికి సహాయంగా పనికి వెళ్లేవాడినని మోదీ తరచూ చెప్తుంటారు.
ఆర్మీలో చేరాలనుకున్నా..
నరేంద్రమోదీకి స్వతంత్య్ర భారతానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచి లక్ష్యం ఉండేది. ఈమేరకు ఆర్మీలో చేరాలని కలలుగన్నారు. ఇందుకోసం జామ్‌నగర్ సైనిక్ స్కూల్‌లో చేరాలని ప్రయత్నించారు. కానీ, ఆర్థిక సమస్యలతో ఆ కల.. కలగానే మిగిలిపోయింది. అయితే.. 1965 ఇండో–పాక్ వార్ సమయంలో రైల్వే స్టేషన్‌కు చేరుకునే భారత సైనికులకు టీ అందించడం ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నారు. ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగుండి ఉంటే.. మోదీ కచ్చితంగా సైనికుడిగా అయ్యేవాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.
పనిమంతుడు..
ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న మోదీ తర్వాత క్రమంలో రాజకీయాలవైపు ఆకర్షితుడయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో కర సేవకుడిగా పనిచేశారు. నర నరానా దేశభక్తిని నింపుకున్న మోదీ తర్వాతి క్రమంలో రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యేలగా, గుజరాత్‌కు మూడుపర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం దేశానికి రెండోసారి ప్రధానిగా ఉన్నారు. మోదీని దగ్గరి నుంచి పరిశీలించిన మంత్రులు, తోటి నాయకులు, చివరికి నరేంద్ర మోదీ వ్యక్తిగత సిబ్బంది ఆయన గురించి చెప్పే ఒకే ఒక్కమాట.. విరామమెరుగని పనిమంతుడు అని. ఆ స్వభావంతో తనకు నిద్ర దూరమైందని చెబుతారు. యోగా, ప్రాణాయామం వల్ల తాను ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండగలుగుతున్నానని మోదీ కూడా తరచూ చెప్తుంటారు.
హోటళ్లకు వెళ్లడం నచ్చదు..
నరేంద్ర మోదీకి హోటళ్లలో బస చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు హోటళ్లలో బస చేయలేదు. ప్రధానిగా కూడా ఆయనెప్పుడూ హోటల్స్‌కు వెళ్లిన దాఖలాలు లేవు. ప్రయాణాలతో ఆ సమయాన్ని భర్తీ చేసుకుంటున్నారు. ప్రధాని అయిన తర్వాత మరుసటిరోజు ఉదయం మీటింగ్ ఉంటే అత్యవసర స్థితిలో మాత్రమే ఆయన హోటల్స్‌కు వెళ్తున్నారట.
నిర్విరామంగా పని..
ఉన్నత పదవుల్లో, స్థానాల్లో ఉన్నవాళ్లు తరచూ విరామం తీసుకోవడం చూస్తుంటాం. కానీ, నరేంద్ర మోదీ మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రిగా.. 13 ఏళ్లలో ఏనాడూ సెలవు పెట్టింది లేదు. అసలు ఆయన అంతకాలంలో జ్వరం బారిన పడిన దాఖలాలు, విరామం తీసుకున్నారనేది కూడా లేకపోవడం విశేషం. ఇప్పుడు ప్రధానిగానూ దేశం కోసం ఆయన అదే నిబద్ధతను ప్రదర్శిస్తున్నారు.
ఒంటని జీవితమే ఇష్టం..
ప్రధాని మోదీకి ఒంటరి జీవితం అంటేనే ఇష్టం. యువకుడిగా ఉన్నప్పుడు దేశంలో చాలాచోట్లు, ఆధ్యాత్మిక యాత్రలు చేశారు. చిన్నతనంలో పెద్దలు బలవంతంగా చేసిన పెళ్లిని ఆయన తిరస్కరించారు. పెళ్లి తర్వాత భార్యతో దూరంగా ఉన్నారు. ఆధ్యాత్మిక, మతపరమైన ధోరణిలో మునిగిపోయే మోదీ తన కాలేజీ జీవితాన్ని కూడా పక్కనపెట్టేశారు. సంచారిగా కోల్‌కతాలోని బేలూర్ మఠానికి తన ప్రయాణానికి కొనసాగించారు. తన 28వ ఏట ఆయన ఢిల్లీ యూనివర్సిటీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇక ఇమేజ్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సు కోసం మూడు నెలలపాటు అమెరికాలో ఉన్నారు.
వర్క్‌హాలిక్..
ప్రస్తుతం ఆయన వివాహితేడే అయినా ఆ బంధానికి ఏళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఒంటరిగా ఉంటూ తనకు జన్మనిచ్చిన దేశానికి ఏదైనా చేయాలన్న తప్పనతో నిరంతరం పనిచేస్తున్నారు. వర్క్‌హాలిక్ అయిన మోదీకి మద్యం, సిగరెట్ లాంటి అలవాట్లు లేవు. నిత్యం యోగా చేసే అలవాటు ఉన్న ఆయన.. పక్కా వెజిటేరియన్. ఫొటోగ్రఫీ, కవితలు–పద్యాలు రాయడం ఆయనకు ఇష్టం. ఆయన ఫొటోలతో చాలాసార్లు ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. ఆధ్యాత్మిక భావం ఎక్కువగా ఉన్న మోదీ దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు ఉపవాస దీక్ష చేస్తారు.
Also Read: PM Modi: సైనికుడు కావాలనుకున్నా సాధ్యం కాలేదు.. నరేంద్రమోదీ ఆర్మీలో ఎందుకు చేరలేకపోయారో తెలుసా?
పాలనలో తనదైన ముద్ర..
మూడుసార్లు ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రధానిగా పనిచేస్తున్న మోదీ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. పాలనాపరమైన నిర్ణయాల్లోనూ తన ముద్ర చూపిస్తున్నారు ఇప్పుడు. అందుకే గ్లోబల్ లీడర్‌లలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు దక్కించుకున్నారు. విదేశాలతో సంబంధాలు నెరపడంలోనూ మోదీకి తన చతురత ప్రదర్శిస్తున్నారు. అందుకే అగ్రదేశాలు కూడా మోదీతో సాన్నిహిత్యాన్ని, భారత్‌తో వ్యాపార సంబంధాలను కోరుకుంటున్నాయి. ఆర్థిక చాణక్యంతో భారత దేశాన్ని ప్రపంచంలో ఐదో సంపన్న దేశంగా నిలుపగలిగారు.