TS Teacher Post Notification: నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధుల సమస్య కొంతవరకు పరిష్కారం అయింది. అయితే స్వరాష్ట్రం సిద్ధించి దశాబ్దం కావస్తున్నా.. నియామకాల విషయం మాత్రం ప్రహసనంగా మారింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో వేలాది ఖాళీలు భర్తీకి నోచుకోవడం లేదు. ఇందులో కీలకమైనవి ఉపాధ్యాయ పోస్టులు. దశబ్దా కాలంలో ఒకే ఒక డీఎస్పీ నోటిషికేషన్ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్లకోసారి డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేది. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మాత్రం పదేళ్లలో ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగులు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అని మదన పడుతున్నారు.
సీఎం హామీకి ఏడాది..
రాష్ట్రంలోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఏడాది క్రితం అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ నెరవేరలేదు. రాష్ట్రంలో పెద్దఎత్తున చేపట్టే నియామకాల్లో భాగంగా టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని గతేడాది మార్చి 9న ప్రకటించారు. ఇందులో భాగంగా సెకండరీ ఎడ్యుకేషన్‌లో ఖాళీగా ఉన్న 13,086 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. ఈ హామీ ఇప్పటికీ ఆచరణలోకి రాకపోగా ఈ పోస్టులను భర్తీ చేస్తారా లేదా అనే విషయంలోనూ స్పష్టత లేదు. టీచర్ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
2020లోనూ ప్రకటన..
అంతకుముందు 2020, డిసెంబరులో కూడా కేసీఆర్ అసెంబ్లీలో టీచర్ పోస్టుల భర్తీపై ప్రకటన చేశారు. అది కూడా అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో గత ఐదేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 6 నెలలకు ఒకసారి టెట్, రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేవారు. తెలంగాణ వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 24 వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి పూనుకోవడం లేదు.
వివిధ విభాగాల్లో 80 వేల పోస్టులు..
రాష్ట్రంలో ఆయా విభాగాల్లోని సుమారు 80 వేల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 62 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. వీటిలో చాలా పోస్టులకు నోటిఫికేషన్లు కూడా జారీ చేశారు. అయితే ఇందులో టీచర్ పోస్టులను మాత్రం పరిశీలనలోకి తీసుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2017లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటి వరకు ఉన్న డీఎస్సీ పేరును టీఆర్టీగా మార్పు చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియమకాలు చేపట్టారు. అప్పట్లో మొత్తం 25 వేల పోస్టుల ఖాళీలు ఉంటే ప్రభుత్వం 13,500 పోస్టులకు ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్ మాత్రం 8,792 ఖాళీల భర్తీకే జారీచేశారు. దశలవారీగా మరికొన్ని పోస్టులు భర్తీ చేశారు.
ఖాళీ పోస్టులు 24 వేలకు పైనే
రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు సుమారు 24 వేలకు పైగానే ఉన్నాయని విద్యావేత్తల అంచనా. మొత్తం 12,943 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు వెల్లడించింది. ఈ మేరకు కేంద్రానికి సమాచారం అందజేసింది. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో 10,657 పోస్టులు, సెకండరీ ఎడ్యుకేషన్‌లో 2,286 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. ప్రాథమిక, మాధ్యమిక విద్యల్లో కలిపి మొత్తం 1,38,517 పోస్టులకు అనుమతి ఉండగా ప్రస్తుతం 1,25,574 పోస్టులు భర్తీ అయి ఉన్నాయి. మిగతా 12,943 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఇంతకుముందు పనిచేసిన 12 వేల మంది విద్యా వలంటీర్ల పోస్టులను ఖాళీగా చూపించలేదు. ప్రస్తుతం వలంటీర్లు లేనందున ఈ 12 వేల పోస్టులు, పైన పేర్కొన్న 12,943 పోస్టులు కలిపితే మొత్తం 24 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
హెచ్‌ఎం పోస్టులేవీ?
ప్రాథమిక పాఠశాలలకు కొత్తగా 5,571 ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. దీనిపై ఇంకా ఉత్తర్వులు జారీ కాలేదు. ఈ పోస్టులు మంజూరైతే ఆ మేరకు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు, ఆయా పాఠశాలలకు రెగ్యులర్ హెచ్‌ఎం పోస్టులు ఉండడంతో అభివృద్ధి జరుగనుందని అంచనా వేస్తున్నారు.
4 లక్షలకు పైగా అభ్యర్థులు
రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం 12,500 మంది డీఎడ్, మరో 15 వేల మంది బీఎడ్ కోర్సు పూర్తి చేస్తున్నారు. మొత్తంగా 1.75 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు, 3 లక్షల మందికి పైగా బీఎడ్ అభ్యర్థులు ఉన్నట్టు అంచనా. వీరిలో టెట్ పేపర్–1, పేపర్–2లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు సుమారు 4 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. వీరంతా టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.