AP Volunteer: వాలంటీర్ల టిక్కెట్ల రాజకీయం

కాకినాడ జిల్లాలో ఓ వాలంటీర్ అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు ప్రత్తిపాడు టికెట్ కేటాయించాలని ఏకంగా సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.

Written By: Dharma, Updated On : August 4, 2023 6:08 pm

AP Volunteer

Follow us on

AP Volunteer: ఏపీ రాజకీయాల్లో వాలంటీర్లు కీలకంగా మారారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లు వ్యవస్థ ద్వారా గెలుపొందాలని జగన్ భావిస్తున్నారు. అందుకే విపక్షాలు వాలంటీర్లు వ్యవస్థను వ్యతిరేకిస్తున్నాయి. పవన్ ఒక అడుగు ముందుకు వేసి వలంటీర్లు వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై వైసీపీ నేతలు మాత్రం దాడి చేశారు. ఒకానొక దశలు పవన్ కళ్యాణ్ పై వాలంటీర్లను బరిలో దించుతామని ప్రకటించారు. అయితే అందులో వాస్తవం ఉందో లేదో తెలియదు గానీ ఇప్పుడు వాలంటీర్లు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దపడిపోతున్నారు.

కాకినాడ జిల్లాలో ఓ వాలంటీర్ అయితే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తనకు ప్రత్తిపాడు టికెట్ కేటాయించాలని ఏకంగా సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. అయితే వాలంటీర్ల కోటాలో ఎక్కడికక్కడే ఆశావహులు ముందుకు వస్తుండడంతో వైసిపి నేతలు తెగ కంగారు పడిపోతున్నారు. జిల్లాకు ఒకరిద్దరు చొప్పున వాలంటీర్లు ఇప్పుడు ఏకంగా టిక్కెట్లు అడుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

ప్రత్తిపాడు నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని గాడి మహేష్ అనే వాలంటీర్ అప్పుడే ప్రయత్నాలను ప్రారంభించారు. ఏకంగా బల ప్రదర్శనకు దిగారు. రౌతులపూడి మండలం పారుపాక గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న మహేష్ ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ టికెట్ ను ఆశిస్తున్నారు. టిక్కెట్ కేటాయించాలని కోరుతూ గ్రామంలో ప్రచార ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. తన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందని.. పైగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని.. సీఎం జగన్ సైతం భవిష్యత్తు నాయకులు వాలంటీర్లు అని చెప్పారని.. అందుకే తాను టిక్కెట్ ఆశిస్తున్నట్లు మహేష్ చెప్పుకొస్తున్నారు. తనకు టిక్కెట్ ఇస్తే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.