Homeఆంధ్రప్రదేశ్‌కేంద్రం ప్రకటనతో భగ్గుమన్న విశాఖ.. ఫైనాన్స్ డైరెక్టర్ ను పరుగులు పెట్టించిన ఆందోళనకారులు

కేంద్రం ప్రకటనతో భగ్గుమన్న విశాఖ.. ఫైనాన్స్ డైరెక్టర్ ను పరుగులు పెట్టించిన ఆందోళనకారులు

Agitators obstruct finance director near administrative building
విశాఖలో స్టీల్ ప్లాంటు ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. పుండుపై కారం చల్లినట్లు పార్లమెంటు వేదికగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో విశాఖ నగరంలో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ సిటీ విశాఖ కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో మంగళవారం భగ్గుమంటోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను నిరసిస్తూ.. కార్మికులు.. ఉద్యోగుల ఆందోళనలు జోరుగా కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా మంగళవారం పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మికులు ప్లాంటులోకి ఉద్యోగులను ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

Also Read: సీబీఐకి నయీం కేసు.. రాజకీయనేతల్లో వణుకు..?

ఈ క్రమంలో స్టీల్ ప్లాంటు లోపలికి వెళ్తున్న ఫైనాన్స్ డైరెక్టరు కారును పరిరక్షణ పోరాట సమితి కమిటీ ఆందోళనకారులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లాంటులోకి ఎవరూ వెళ్లడానికి వీలు లేదని తేల్చి చెప్పేశారు. తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఫైనాన్స్ అధికారి కారును అడ్డుకుని డైరెక్టరును ఘెరావ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఒక్కసారిగా డైరెక్టరును అడ్డుకోవడంతో స్టీల్ ప్లాంటు పరిపాలన భవనం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఫైనాన్స్ డైరెక్టర్ వేణుగోపాల్ ను ఉద్యమకారులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది డైరెక్టరును అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. ఆందోళనకారులు ఫైనాన్స్ డైరెక్టర్ వెనకాలే పరుగులు తీశారు. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారుల ఆగ్రహావేశాలను చూసిన ఫైనాన్స్ డైరెక్టరు వేణుగోపాల్ అక్కడి నుంచి పరుగుతీశారు. మరోవైపు విశాఖలో ఉధృతంగా కొనసాగుతున్న నిరసనల హోరుతో పాటు రహదారుల దిగ్భంధం కారణంగా చాలాచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also Read: వైసీపీని టార్గెట్ చేసిన రిపబ్లిక్ టీవీ ఆర్నబ్..?

రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారిమళ్లిస్తున్నారు. తునివైపు వెళ్లాల్సిన వాహనాలను లంకెలపాలెం నుంచి.. సబ్బవరం మీదుగా మళ్లిస్తున్నారు. శ్రీకాకళం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలను ఎన్ఏడీ జంక్షన్ పెందుర్తి మీదుగా మళ్లిస్తున్నారు. ఆందోళనల కారణంగా ఎన్ఏడీ నుంచి కుర్మన్నపాలెం వరకు అనకాపల్లి నుంచి లంకెలపాలెం వరకు ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యింది. మరోవైపు నిన్నరాత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన తరువాత ప్రారంభమైన ఆందోళన కుర్మన్నపాలెం జంక్షన్ వద్ద ఇంకా కొనసాగుతూనే ఉంది. సిటీవ్యాప్తంగా ఆందోళన కారులు రోడ్లను దిగ్బంధించడంతో జాతీయరహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్దీకరించే పనిలో పడ్డారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version