Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లవుతున్నా నిందితులను ఇంతవరకూ పట్టుకోలేదు. కేసు విచారణ కొలిక్కి రాలేదు. సుదీర్ఘంగా సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఈ నేపథ్యంలో కేసులో కీలకమైన సాక్షిగా ఉన్న కల్లూరు గంగాధర్‌రెడ్డి అకాల మరణం మిస్టరీగా మారింది. బెదిరింపులు, ఒత్తిళ్లే ఆయన మరణానికి కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివేకా హత్య కేసులో ఏ-5 నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి గంగాధర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు. హత్య కేసు సాక్షుల్లో ఇతడూ ఒకరు. గంగాధర్‌రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల. అప్పట్లో శివశంకర్‌రెడ్డి చేసే అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. గంగాధర్‌రెడ్డిని సీబీఐ ఇప్పటికి మూడు సార్లు విచారించింది. హత్యను తనపై వేసుకుంటే రూ.10 కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి తనకు ఆశచూపాడని సీబీఐకి వాంగ్మూలమిచ్చి సంచలనం సృష్టించిన గంగాధర్‌రెడ్డి.. ఈ విషయం మేజిస్ట్రేట్ ముందు రికార్డు చేసేందుకు నిరాకరించాడు. ఆ తర్వాత హత్య తానే చేసినట్లు అంగీకరించాలంటూ సీబీఐ అధికారులు తనను బలవంతం చేశారంటూ అప్పట్లో ఆరోపణలు చేశాడు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అనంతరం కొద్దిరోజులకు అనంతపురం వెళ్లి ప్రెస్‌మీట్ కూడా పెట్టాడు. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ కొన్ని నెలల క్రితం అనంతపురం ఎస్పీని కలిశాడు. అప్పట్లో పోలీసులు వాచ్ అండ్ సెక్యూర్ పద్ధతిలో రక్షణ కల్పించారు.
ప్రాణ భయంతో మకాం మార్పు..
గంగాధర్ రెడ్డిది ప్రేమ వివాహం. అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో ఉంటున్న ఫరీదా.. తరచూ తన అమ్మమ్మ ఊరు పులివెందులకు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో పులివెందులలో ఉండే గంగాధర్‌రెడ్డితో ఫరీదాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో ఫరీదాబానును 2006 మే 29న వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఫరీదాబాను గృహిణి, పెద్ద కుమార్తె పద్మావతమ్మ 9వ తరగతి చదువుతోంది. రెండో కూతురు మణికంఠేశ్వరి 8వ తరగతి, కుమారుడు సాయిగంగిరెడ్డి 5వ తరగతి చదువుతున్నారు. ప్రస్తుతం కుటుంబంతో యాడికిలో నివాసముంటున్నారు. ప్రాణ భయంతోనే ఆయన ఊరు మార్చారని తెలుస్తోంది. అయితే గంగధర్ రెడ్డి మరణం నేపథ్యంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. భార్య ఫరీదా బాను కీలక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసులో శంకర్‌రెడ్డి నిందితుడు కావడంతో ఆయన అనుచరుడైన తన భర్తకు పలురకాల బెదిరింపులు వచ్చాయని.. దానివల్ల ఎంతో ఒత్తిడికి గురయ్యాడని.. షుగర్ లెవల్స్ తరచూ పడిపోయేవని ఆమె తెలిపారు. నా భర్త గత 12 ఏళ్లుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతిగా మద్యం సేవించేవాడు. షుగర్ కంట్రోల్ కాకపోవడంతో తాడిపత్రి, అనంతపురం ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునేవాడు. ఎడమ కాలి బొటనవేలు ఎక్కువ గాయం కావడంతో ఈ ఏడాది ఏప్రిల్ 29న శస్త్రచికిత్స చేసి వేలు తీసేశారు. అయినప్పటికీ మద్యం తాగడం ఆపలేదు. ఇటీవల గాయమైన చోట ఎలుక కొరకడంతో మరింత ఎక్కువైందని పోలీసులకు చెప్పారు.
Also Read: YCP MLAs Graph: గ్రాఫ్ పెంచుకునేదెలా? అధినేత అల్టిమేటంపై వైసీపీ నేతల మల్లగుల్లాలు
గత మూడురోజులుగా..
గత మూడ్రోజులుగా గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువైంది. కడుపులో నొప్పిగా ఉందని బాధపడుతుంటే గ్రామంలోని ఆర్‌ఎంపీతో చికిత్స చేయించాం. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పిల్లలతో కలిసి భోజనం చేసి నిద్రపోయాం. గురువారం ఉదయం 6:15 గంటల సమయంలో నిద్రలేచాను. పాలు తీసుకోవడానికి వెళ్తూ గంగాధర్‌రెడ్డిని నిద్ర లేపేందుకు ప్రయత్నించాను. ఆయన శరీరమంతా చల్లగా ఉంది. ఉలుకూ పలుకూ లేదు. దీంతో ఆర్‌ఎంపీకి ఫోన్‌చేసి పిలిపించాం. ఆయన వచ్చి పరిశీలించి 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. వారు వచ్చి చూసి, అప్పటికే మరణించినట్లు ఫరీదా చెబుతున్నారు. నా భర్త మరణానికి బెదిరింపులు, ఒత్తిళ్లే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నేర చరిత..
గంగాధర్ రెడ్డి పలు తీవ్రమైన కేసుల్లో నిందితుడు. ఆయన శివశంకర్ రెడ్డి చెప్పిన పనల్లా చేసేవారని చెబుతూంటారు. పులివెందులలో పుట్టి పెరిన గంగాధర్ రెడ్డి ప్రేమ వివాహం చేసుకుని యాడికికి మకాం మార్చారు. అయినప్పటికీ శంకర్ రెడ్డి చెప్పే పనులు చేసేవారు. ప్రాణభయం ఉందని వ్యక్తం చేసిన గంగాధర్ రెడ్డి అనుమానాస్పదంగా చనిపోవడం ఆసక్తి రేపుతోంది. గతంలో పరిటాల రవి కేసులోనూ అనుమానితులు.. సాక్షులు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. గతంలోనూ ఓ సాక్షి ఇలా అనుమానాస్పదంగా చనిపోయారు.
Also Read:YCP Leaders: వైసీపీ నేతల ఉసురుతీస్తున్న సర్కారు.. బిల్లులు చెల్లించకపోవడంతో బలవన్మరణాలు