Visakhapatnam Capital: మాడున్నరేళ్లుగా మూడు రాజధానులంటూ వైసీపీ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. మూడు రాజధానులతో ముచ్చటగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పకొచ్చారు. అమరావతి భ్రమరావతిగా ప్రచారం చేశారు. అయితే చివరకు ఆ అమరావతి నుంచే పాలన సాగిస్తూ మూడు రాజధానుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది కూడా ప్రజలకు భ్రమలు కల్పించడానికే తప్ప.. ఎటువంటి చిత్తశుద్ధి లేదని నేతల మాటల ద్వారా బయటపడుతోంది. మూడు రాజధానుల్లో.. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత అని.. అమరావతిని ఎటువంటి నిర్లక్ష్యం చేయడం లేదని చెప్పుకొచ్చినా వర్కవుట్ కాకపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు స్వరం మార్చారు. విశాఖ ఏకైక రాజధానిగా చెప్పడం ప్రారంభించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు వరుసగా సమావేశాలు నిర్వహించి ఇప్పుడు ఇదే మాటను వల్లె వేయడం ప్రారంభించారు.

హైకోర్టు ఒకచోట, అసెంబ్లీ మరోచోట ఉంటే వాటిని రాజధానులుగా భావించలేమని..విశాఖను మాత్రమే ఒన్ అండ్ ఓన్లీ కేపిటల్ గా పిలువగలమని ధర్మాన కొత్తగా చెబుతున్నారు. కానీ ఇది పాతమాటే. మూడు రాజధానుల మాటున అమరావతి నుంచి విశాఖకు క్యాపిటల్ మార్చడమే వైసీపీ ఉద్దేశ్యంగా ఎప్పటి నుంచో అనుమానాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే వైసీపీ మూడు రాజధానుల అంశం ముందు పెట్టింది. కొన్ని దేశాలు, రాష్ట్రాలను సాకుగా చూపింది. కానీ అదేమీ వర్కవుట్ కాలేదు. అమరావతి నుంచి స్ట్రయిట్ గా విశాఖకు తరలిస్తామంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని భావించి మూడు ప్రాంతాల అభివృద్ధిని సాకుగా చూపి మూడు రాజధానులకు ప్లాన్ చేశారు. కానీ ఇక్కడ కూడా చుక్కెదురు కావడంతో ఇప్పుడు ధర్మాన లాంటి వారితో విశాఖ ఏకైక రాజధాని అని చెప్పిస్తున్నారు.

అయితే ఇటువంటి వికృత క్రీడ వైసీపీకి కొత్త కాదు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకు ఎన్ని నిర్వచనాలు చెప్పారో అందరికీ తెలిసిందే. ప్రత్యేక హోదా వస్తే ఏపీలోని అన్ని రాష్ట్రాలు హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చెందుతాయని ఊరూ వాడా ప్రచారం చేశారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వం దయా దక్షిణ్యాలపై నెట్టేశారు. ఇప్పుడు రాజధానుల విషయంలో కూడా అటువంటి కపట నాటకానికి తెరతీశారు. మూడు రాజధానుల మాటున అమరావతి నుంచి విశాఖకు క్యాపిటల్ తరలించేందుకు పన్నాగం పన్నుతున్నారు. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఒక్కొక్కరూ గొంతు విప్పుతుండడంతో మూడు ప్రాంతాల ప్రజలు విస్తుపోతున్నారు. సీఎం ఎక్కడ నుంచి పాలన సాగిస్తారో.. అదే రాజధాని అంటూ తలాతోకా లేని మరో నినాదాన్ని బయటకు వదులుతున్నారు.