Visakhapatnam Capital: విశాఖనే రాజధాని.. అడ్డుకునే పనిలో టీడీపీ

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధాని కి పరిమితం చేసి.. విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలు ను న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి విధితమే.

Written By: Dharma, Updated On : October 13, 2023 11:33 am

Visakhapatnam Capital

Follow us on

Visakhapatnam Capital: జగన్ విశాఖ నుంచి పాలనకు సిద్ధపడుతున్నారు. విజయదశమి నుంచి విశాఖ క్యాంప్ ఆఫీసులో పాలన ప్రారంభించనున్నారు. ఇ ప్పటికే రిషికొండపై నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 270 కోట్ల రూపాయలతో చేపడుతున్న నిర్మాణాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. సీఎం నివాసం తో పాటు కీలక విభాగాలకు సంబంధించి పనులు పూర్తయ్యాయి. బయట రహదారులు, ఇతరత్రా నిర్మాణాలు జరుగుతున్నాయి.అయితే విశాఖలో క్యాంప్ ఆఫీస్ కాదు.. మొత్తం యంత్రాంగాన్ని విశాఖకు తరలిస్తుండడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా.. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని సాకుగా చూపి ప్రత్యేక జీవోతో అనధికార రాజధాని ఏర్పాటు చేస్తున్నారని టిడిపి తో పాటు ఎల్లో మీడియా ఆరోపిస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిని శాసన రాజధాని కి పరిమితం చేసి.. విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలు ను న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి విధితమే. కానీ అడుగు ముందుకు వేయలేకపోయారు జగన్. అమరావతి రైతులు ఉద్యమ బాట పట్టారు. అన్ని రాజకీయ పక్షాలు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఈ తరుణంలో హైకోర్టులో అమరావతికి మద్దతుగా తీర్పు వచ్చింది. దానిని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ విచారణ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. మరోవైపు ఎన్నికలు సమీపించడంతో విశాఖ నుంచి పాలన సాగించడానికి జగన్ డిసైడ్ అయ్యారు. విజయదశమిని ముహూర్తంగా నిర్ణయించారు.

వాస్తవానికి సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ మాత్రమే విశాఖలో ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. కానీ దాదాపు అన్ని శాఖలకు సంబంధించి యంత్రాంగాన్ని విశాఖ తరలిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం అనే టెక్నికల్ అంశాన్ని తీసుకుని ప్రత్యేక జీవో జారీ చేసి అనధికార రాజధాని ఏర్పాటు చేస్తున్నారని టిడిపి తో పాటు ఇతర పక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కోర్టులో కేసు ఉండగా ప్రత్యేక జీవోతో రాజధానిని ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నాయి. అయినా ఇవేవీ పట్టించుకోని జగన్ సర్కార్ విశాఖ రిషికొండలో చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

అయితే జగన్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. గత నాలుగున్నర ఏళ్లుగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై జగన్ పట్టించుకోలేదు. ఒక్క ప్రత్యేక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదు. ఇప్పుడు వెనుకబాటు తనం అంటూ సాకుగా చూపి విశాఖ రాజధానిని అనధికారికంగా ఏర్పాటు చేయాలన్న తలంపుతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఆయనకు సానుకూలంగా తీర్పు వస్తే టిడిపి దీనిపై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. లేకుంటే మాత్రం ఎంపీ రఘురామకృష్ణంరాజు లీడ్ తీసుకుని జగన్ అనధికారిక విశాఖ రాజధానిపై న్యాయపోరాటం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.