Visakha Investment Conference: విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈనెల 14 నుంచి రెండు రోజులపాటు ఈ భాగస్వామ్య సదస్సు జరగనుంది. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలను, సంస్థలను ప్రత్యేకంగా ఆహ్వానించింది ఏపీ ప్రభుత్వం. సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి నారా లోకేష్, మరియు మంత్రుల బృందం విదేశాలకు వెళ్లి మరి ఆహ్వానించారు. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీకి గేమ్ చేంజర్ గా ఈ పెట్టుబడుల సదస్సు నిలవనుంది. ఏపీకి పెట్టుబడుల వరద వచ్చే అవకాశం ఉంది.
* ప్రపంచ ప్రతినిధుల రాక..
రెండు రోజులపాటు జరిగే సదస్సులో 37 ప్లీనరీ సెషన్లు, ఐదు కంట్రీ సెషన్లు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రముఖ కంపెనీల సి ఎక్స్ ఓ లు, ఆర్థిక నిపుణులు సైతం హాజరుకానున్నారు. దాదాపు 410 ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకోనుంది. వీటి ద్వారా పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ఒక అంచనా. ఇదే విషయంపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఈ పెట్టుబడుల ద్వారా ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ కార్యరూపం దాల్చుతుందని అభిప్రాయపడ్డారు నారా లోకేష్. ఏపీకి పరిశ్రమల ద్వారా పన్నుల ఆదాయం లభించనుంది. ఆపై పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరగనుంది.
* కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం..
ఈ పెట్టుబడుల సదస్సుకు కేంద్ర ప్రభుత్వ( central government) సహకారం సంపూర్ణంగా ఉంది. విశాఖ వేదికగా రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, అశ్విని వైష్ణవ్, అన్నపూర్ణాదేవి, జితేంద్ర సింగ్ లు హాజరు కానున్నారు. 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఎనిమిది మంది స్పీకర్లు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు. 82 ప్రాజెక్టులకు సంబంధించి శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సు వేదికగా కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి.
* గత ఆరు నెలలుగా సన్నాహాలు..
వాస్తవానికి విశాఖలో( Visakhapatnam) పెట్టుబడుల సదస్సు పెట్టాలని ఆరు నెలల కిందట నిర్ణయించారు. గత ఏడాది దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం లోకేష్ లతో కూడిన బృందం. అయితే అప్పట్లో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలిశారు. వారితో చాలా విషయాలను చర్చించారు. అప్పుడే విశాఖ పెట్టుబడుల సదస్సుకు ఆలోచన చేశారు. గత ఏడాదిగా దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా జరిగింది. ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సుకు సైతం చంద్రబాబు హాజరయ్యారు. అయితే గత ఆరు నెలలుగా దేశీయ, విదేశీ దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలుస్తూ వచ్చారు. వారంతా ఈ సదస్సుకు రానున్నారు. అయితే ఇది ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.