Vijayasai Reddy: సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా.. సామాజిక మాధ్యమాలు ఎన్ని ఉన్నా.. పత్రికలు, టీవీ చానళ్ల ప్రాధాన్యం మాత్రం తగ్గడం లేదు. క్రెడిబులిటీ కోల్పోవడం లేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన, వైరల్ అయిన వార్తలు, కథనాలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి అయినా పాఠకులు, ప్రేక్షకులు పత్రికలు, న్యూస్ చానెళ్లు చూస్తున్నారు. ప్రస్తుతం డిజిటల్ యుగంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్ని పార్టీలు సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు చేసుకున్నాయి. అయినా పత్రికలు, టీవీ చానళ్లలో వస్తున్న వ్యతిరేక కథనాలు వారి ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి. పార్టీ నాయకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు సొంత పత్రికలు, చానెళ్లు పెట్టుకుంటున్నాయి. తమకు అనుకూల వార్తలు, కథనాలు ప్రచురితం, ప్రసారం చేయించుకుంటున్నాయి. ఆంధ్రాలో వైసీపీకి సొంత చానల్ సాక్షి టీవీ, సాక్షి పత్రిక ఉంది. అయినా పోటీ పత్రిక ఈనాడు కథనాలు వైసీపీ ప్రభుత్వానికి, మంత్రులకు, నేతలకు మింగుడు పడడం లేదు. ఈనాడు పత్రిక, ఈటీవీలో వస్తున్న కథనాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు అయిన విజయాసాయిరెడ్డిపై ఇటీవల ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5లో వస్తున్న కథనాలు వైసీపీకి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన విజయసాయిరెడ్డి వ్యతిరేక పత్రికల్లో వస్తున్న కథనాలను తిప్పి కొట్టేందుకు తాను కూడా మీడియారంగంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీకి ఇప్పటికే సొంతంగా న్యూస్ పేపర్‌తోపాటు టీవీ చానల్ కూడా ఉంది. అయినా విజయసాయిరెడ్డి మీడియారంగంలోకి వస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశమైంది.

టీడీపీ అనుకూల మీడియాపై కోపంతో..
టీడీపీ అనుకూల మీడియాపై మండిపడిన విజయసాయిరెడ్డి టీడీపీ అనుకూల పత్రికలను కరపత్రికలతో పోల్చారు. తన ఆస్తుల గురించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆస్తుల విషయంలో తాను విచారణకు సిద్ధమని విజయసాయిరెడ్డి తెలిపారు. అయితే వైసీపీ గెలుపు కోసమే విజయసాయిరెడ్డి మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి నిర్ణయం వెనుక జగన్ ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాము కాస్కో…
తనపై రామోజీరావు పత్రిక, టీవీ ఉందని ఇష్టానుసారం రాస్తున్నారని.. త్వరలో తానే స్వయంగా టీవీ చానల్ పెట్టబోతున్నానని ఇకపై చూసుకుందామని రామోజీరావుకు విజయసాయిరెడ్డి సవాల్ చేశారు. రామోజీరావుపై ఒక సీరియల్ రాస్తానని కూడా చెప్పారు. విశాఖ దసపల్లా భూములపై మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి.. భూములు కమలాదేవికి చెందుతాయని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. ఈ విషయం తెలిసి కూడా కుల పిచ్చితో రామోజీ రాస్తున్నాడని మండిపడ్డారు. 64 మంది స్థలాల యజమానుల్లో 55 మంది చంద్రబాబు సామాజికవర్గం వారేనని.. ప్రస్తుత నిర్ణయంతో ఎక్కువ లబ్ది పొందేది చంద్రబాబు సామాజికవర్గమేనన్నారు.

బాబు అనుకూల, వైసీపీ వ్యతిరేక కథనాలతో ఇబ్బందులు..
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా చంద్రబాబు అనుకూల మీడియాకు సంబంధించిన చానð ళ్లు, వెబ్‌సైట్లు, న్యూస్ పేపర్లు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా వైసీపీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాయి. సాక్షి టీవీ, పత్రిక వీటిని తిప్పికొట్టలేకపోతున్నాయన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. విజయసాయిరెడ్డి కూడా ఆదే భావనలో ఉన్నారు. ఈ కారణం వల్లే మీడియా సపోర్ట్ మరింత పెరగాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఆయన సక్సెస్ అవుతారో లేదో చూడాలి.
ఉన్నవాటికే పెట్టుబడి పెడితే..
విజయసాయిరెడ్డి కొత్త పత్రికలను, కొత్త ఛానెళ్లను మొదలుపెట్టడానికి బదులుగా ఇప్పటికే ఉన్నవాటిలో పెట్టుబడి పెడితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విజయసాయిరెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి. 2024 ఎన్నికల్లో కూడా పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మీడియా సపోర్ట్ కూడా ఉంటే వైసీపీ మరిన్ని ఎక్కువ సీట్లలో విజయం సాధించే ఛాన్స్ ఉంది.