CM Vijay: ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని.. వాటిని అమల్లో పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అలా చేసేవారెవరున్నారు.. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పక్కన పెడతారు. ప్రజల కోణంలో కాకుండా.. తమ కోణంలో ఆలోచిస్తుంటారు. అప్పుడు ఓట్లు వేసిన ప్రజలు చింతిస్తూ ఉంటారు. ఇటువంటి రాజకీయాలు మనదేశంలో చాలా సంవత్సరాల నుంచి సాగుతూనే ఉన్నాయి. ప్రత్యామ్నాయ పార్టీలు కూడా ఇలానే వ్యవహరిస్తూ ఉండడంతో జనాలు కూడా నమ్మకాన్ని కోల్పోయారు. ఏదో ఓట్లు వేసే పండుగ వచ్చినప్పుడు తమ హక్కును వినియోగించుకొని.. ఆ తర్వాత బాధపడుతున్నారు.
ఇటువంటి రాజకీయాలు సాగుతున్న దేశంలో అప్పుడప్పుడు దీప శిఖలాగా కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయల స్వభావాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. అంతేకాదు తాము ఒక టార్చ్ బేరర్ లాగా మారిపోతున్నారు. ఈ జాబితాలో టీవీకే అధినేత విజయ్ మొదటి స్థానంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఆయన ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. ప్రజలకు అమలు చేయగలిగే హామీలు మాత్రమే ఇచ్చారు. వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ కూడా రూపొందించారు. కొన్నింటిని ఆల్రెడీ అమల్లో పెడుతున్నారు కూడా.
ఫీజులు వసూలు చేయడం కుదరదు
ఇకపై తమిళనాడులో ప్రభుత్వేతర విద్యాలయాలు విద్యార్థుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం కుదరదు. ప్రభుత్వం నిర్దేశించిన విధానంలో మాత్రమే ఫీజులు స్వీకరించాలి. అదనంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అవసరమైతే గుర్తింపు కూడా రద్దు చేస్తుంది. కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడదు. ప్రభుత్వ వెబ్ సైట్ లలో నమో చేసిన విధంగానే ప్రైవేట్ విద్యాలయాలు ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ.. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా తీసుకుంటుంది.
అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదు
తమిళనాడు ఇటీవల ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజు వసూళ్లపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ వ్యవహారం పై సీరియస్ అయ్యారు.వెంటనే కీలక ప్రకటన చేశారు. ప్రైవేట్ విద్యాలయాల నిర్వాహకులు అధికంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ప్రభుత్వం హయాంలో ప్రైవేట్ విద్యాలయాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసేవని, అధికార పార్టీకి చెందిన వారి విద్యాలయాలే ఇందులో అధికంగా ఉన్నాయని.. అందువల్లే ఇటీవల ప్రభుత్వానికి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని.. ముఖ్యమంత్రి విజయ్ నేరుగా స్పందించి ఈ నిర్ణయం తీసుకున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
