Vijaysai Reddy: త్వరలో చీలనున్న టిడిపి.. విజయ్ సాయి రెడ్డి సంచలన ట్విట్

గత ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. తెలుగుదేశం పార్టీని కకావికలం చేసింది. గత నాలుగున్నర ఏళ్లుగా రాజకీయంగా బలహీనపరచడానికి అన్ని ప్రయత్నాలు చేసింది.

Written By: Dharma, Updated On : October 3, 2023 2:27 pm

Vijaysai Reddy

Follow us on

Vijaysai Reddy: తెలుగుదేశం పార్టీని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందా? ఆ పార్టీ నిట్ట నిలువునా చీలనుందా? బలమైన ఓ సామాజిక వర్గం బయటకు రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి తాజాగా పెట్టిన ట్విట్ ఒకటి ఆలోచింప చేస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఏదో ఒకటి జరగబోతుందని సంకేతాలేస్తోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను నయానో..భయానో లొంగదీసుకుని.. ఆ పార్టీని దారుణంగా దెబ్బతీయాలన్న ప్లాన్ కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్.. తెలుగుదేశం పార్టీని కకావికలం చేసింది. గత నాలుగున్నర ఏళ్లుగా రాజకీయంగా బలహీనపరచడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ముందుగా కీలక నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసింది. నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసింది. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంది. ద్వితీయ శ్రేణి క్యాడర్ను సైతం లాక్కుంది. ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైనే దాడి చేసింది. అచ్చెనాయుడు నుంచి నిన్నటి బండారు సత్యనారాయణ మూర్తి వరకు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. చివరికి చంద్రబాబును జైల్లో పెట్టిన విశ్రమించలేదు.

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడమే వైసిపి ముఖ్య ఉద్దేశం. చంద్రబాబును అరెస్టు చేసి మూడు వారాలు దాటుతోంది. తరువాత వంతు నారా లోకేష్ దేనట్టు సంకేతాలు వస్తున్నాయి. అటు తరువాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు సైతం అరెస్టు కావడం ఖాయం అన్న ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముంగిట టిడిపిని అస్థిర పరచడమే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది.

ఇటువంటి తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ” అధినాయకుడు కరప్షన్ కేసులో జైలు పాలైనా పార్టీ శ్రేణులు పెద్దగా పట్టించుకోకపోవడం టిడిపి దయనీయస్థితికి అద్ధం పడుతుంది. త్వరలోనే ఆ పార్టీ రెండు, మూడు ముక్కలుగా చీలిపోవచ్చు. 40 సంవత్సరాలుగా పార్టీకి మద్దతిస్తున్న ‘ బలమైన’ వ్యాపార వర్గంలో పునరాలోచన ప్రారంభమైంది. ఆయన దోపిడీలను పాము ఎందుకు సమర్ధించాలన్న ఆలోచనలో పడ్డారు”అంటూ విజయసాయిరెడ్డి ట్విట్ సాగింది. అయితే ఇది టిడిపి శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టే సరికొత్త ఎత్తుగడని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొందని.. పార్టీ విచ్చినం అయ్యే ఛాన్సే లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్లు తేల్చి చెబుతున్నారు. లక్షలాదిమందితో పార్టీకి రక్షణ కవచం ఉందని.. జగన్ లాంటి వాళ్లు 100 మంది వచ్చినా టిడిపిని ఏం చేయలేరని చెబుతున్నారు.