
ఆకాశం నుంచి వానపడుతుంటుంది. కానీ చేపలు పడితే ఏం జరుగుతుంది? జనాలు ఎగబడి పోరు.. ఆ చేపలను పట్టుకొని తింటారు. అయితే ఇవి నిజంగా పడలేదు. పడేలా చేశారు.
అమెరికాలోని ఉటా రాష్ట్రంలో సరస్సుల్లో చేపల సంఖ్యను పెంచడానికి విమానంలో తీసుకొచ్చిన వేలాది చేప పిల్లలను ఒక్కసారిగా సరస్సులో వదిలేశారు. సరస్సులో చేపల పునరుద్దరణలో భాగంగా విమానం అడుగు భాగంలో ఉన్న రంధ్రం ద్వారా 35వేల చేప పిల్లలను జారవిడిచారు.
కొండ ప్రాంతాల్లోని చెరువుల్లో చేపల పంపకానికి సులభంగా ఉన్న ఈ పద్ధతినే కొన్నాళ్లుగా అనుసరిస్తున్నట్లు వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ అధికారులు వివరించారు.
చేపల వయసులో తక్కువే కావడంతో ఎత్తునుంచి కిందపడినా వాటిలో 95శాతం బతికే అవకాశం ఉండడంతో ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు తెలిపారు. అమెరికాలోని కొండ ప్రాంతాల్లోని చెరువులలోకి వెళ్లి మనుషులు చేప పిల్లలను వేయడం కష్టం. అది వ్యయ ప్రయాసలకోర్చి చేయాలి. అందుకే విమానంలో నింపి వాటి ద్వారా చెరువుల్లో చేప పిల్లలను వదిలేస్తున్నారు.
ఎగురుతున్న చేప పిల్లలను చెరువులో విమానంలోంచి వదులుతుంటే అబ్బురపరుస్తోంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.