
ఇండియన్ పోస్టల్ శాఖలో ఖాతాలు ఓపెన్ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కస్టమర్ల కొరకు పోస్టల్ శాఖ ఎన్నో కొత్త స్కీమ్ లను అమలు చేస్తోంది. అధిక రాబడి అందించే విధంగా స్కీమ్‌లను ప్రవేశపెట్టడంతో పాటు కస్టమర్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బుపై భారీ మొత్తంలో వడ్డీని చెల్లిస్తోంది. అయితే ఆగష్టు నెల 1వ తేదీ నుంచి పోస్టాఫీస్ లో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
పోస్టాఫీస్ ఖాతాదారులు కొత్త నిబంధనల గురించి అవగాహన ఏర్పరచుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఈ నిబంధనల వల్ల ఖాతాదారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. నూతన నిబంధనల ప్రకారం ఇకపై పోస్టాఫీస్ ఖాతాదారులు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలంటే ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులకు ఎటువంటి ఛార్జీలు లేవు.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు వడ్డీ రేట్లను కూడా గతంతో పోలిస్తే భారీగా తగ్గించడం గమనార్హం. ప్రస్తుతం ఐపీపీబీలో సేవింగ్స్ ఖాతా కలిగి ఉన్నవాళ్లకు కేవలం 2.5 శాతం వడ్డీ మాత్రమే లభిస్తుందని తెలుస్తోంది. అయితే ఇకపై పోస్టాఫీస్ ఖాతాదారులు ఐపీపీబీ యాప్ సహాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, మనీ ట్రాన్స్ ఫర్, ఇతర ఆర్థిక సేవలు పొందవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని యాప్ యొక్క సేవలను సులభంగా వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే పోస్టాఫీస్ బ్రాంచ్ కు వెళ్లకుండానే ఈ సేవలను పొందవచ్చు.