Vice President Venkaiah Naidu: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. అయితే ఆయనకు రెన్యూవల్ లభించడం కష్టమేనని తెలుస్తోంది. ఒకవేళ రెన్యూవల్ లేకపోతే ఆయన పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనకు ప్రభుత్వంలో కానీ, పార్టీలో కానీ క్రియాశీల పదవులు అప్పగించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే దీనికి బీజేపీ పెద్దలు చూపుతున్న కారణం వయసు. ప్రస్తుతం వెంకయ్యనాయుడి వయసు 73 సంవత్సరాలు. బీజేపీ వయసు విషయంలో లైన్ తీసుకుందని ఈ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయానికి వస్తే ప్రధాని మోదీది కూడా దాదాపు ఇదే వయసు. ఒకటి, రెండు సంవత్సరాలు వెంకయ్యనాయుడి కంటే చిన్న ఉంటారు. బీజేపీ లైన్ ప్రకారం ఆయన పదవులకు దూరమవుతారా? అన్న ప్రశ్నకు మాత్రం బీజేపీ వర్గాల నుంచి సమాధానం లేదు.
ఊహించని పరిణామం..
అయితే ఈ విషయం పక్కన పెడితే.. వెంకయ్యనాయుడును ఇంత తొందరగా సాగనంపుతారని ఎవరూ అనుకోలేదు. అసలు ఊహించలేదు. ఉప రాష్ట్రపతి ఎంపిక నాడు అనూహ్యం. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన్ను నాడు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. కానీ వెంకయ్యనాయుడు నిరాసక్తత చూపారు.తప్పనిసరి పరిస్థితుల్లో నాడు మంత్రి నుంచి ఉపరాష్ట్రపతి పదవికి మారారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం నుంచి సాగనంపేందుకే నాడు మోదీ, అమిత్ షా ద్వయం ఈ కొత్త ప్రయోగానికి తెరలేపారని ప్రచారం సాగింది. వెంకయ్య కూడా గత ఐదేళ్లుగా ఉప రాష్ట్రపతి పదవిలో అయిష్టతగానే కొనసాగారు. పెద్దల సభ నడిపేందుకు ఆపసోపాలు పడ్డారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా సమర్థవంతంగా వ్యవహరించారన్న పేరు దక్కించుకున్నారు. రాష్ట్రపతి పదవిని ఆశించారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం మొండి చేయి చూపారు.
Also Read: Dolo-650: అమ్మకాలు పెంచుకునేందుకు డోలో 650 లంచాలు ఇచ్చిందా
సేవల వైపు మొగ్గు..
ఇప్పుడు ఉప రాష్ట్రపతి పదవీకాలం ముగియడంతో అటు ప్రభుత్వంలో, ఇటు బీజేపీలో చేరి యాక్టివ్ అవుతానని వెంకయ్య ప్రకటించలేదు. కానీ రకరకాల ఊహాగానాలు మాత్రం వెలువడుతున్నాయి. మరోవైపు రాజకీయంగా ఎన్నో పదవులు చూశానని.. ఇక విశ్రాంతి తీసుకుంటానని వెంకయ్య తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వెంకయ్యనాయుడు కుమార్తె స్వర్ణభారతి స్వచ్ఛంద సంస్థ పేరిట సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. వెంకయ్య కూడా ఇతోధికంగా సాయం చేస్తూ వస్తున్నారు. పదవీకాలం ముగిశాఖ స్వచ్ఛంద సంస్థ సేవలో తరించాలని వెంకయ్య భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
అగ్రనేతల్లో ఒకరు..
ఒక విధంగా చెప్పాలంటే బీజేపీని నిలబెట్టిన కీలక నాయకుల్లో వెంకయ్య ఒకరు. మంచి వ్యూహకర్తగా పేరుంది. పార్టీ క్లిష్ట సమయంలో సైతం అధ్యక్షుడిగా వ్యవహరించి పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషిచేశారు. పార్టీని నిలబెట్టారు. బీజేపీ సిద్ధాంతాలను, విధానాలను ముందుకు తీసుకెళ్లడంలో వెంకయ్య పాత్ర కీలకం. అయితే 2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో ప్రధాని మోదీ కేబినెట్ లో వెంకయ్యనాయుడుకు కీలక శాఖ అప్పగించారు. మూడేళ్ల పాటు వెంకయ్య మెరుగైన సేవలందించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సైతం ప్రభుత్వ విధానాలను అనర్గళంగా మాట్లాడేవారు. పాలనాపరంగా తన మార్కు చూపించారు. అయితే మోదీ, షా ద్వయం వెంకయ్యనాయుడిని సాగనంపాలనుకున్నారో.. లేక ఎగువసభలో విపక్షాలను దీటుగా ఎదుర్కొని సభను నడిపే వ్యక్తిగా భావించారో ఏమో కానీ నాడు వెంకయ్యను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసి పదవులో కూర్చొబెట్టారు. అయితే అప్పట్లోనే భావి రాష్ట్రపతి వెంకయ్య అని అంతా భావించారు. కానీ బీజేపీ పెద్దలు సమయం వచ్చేసరికి మోకాలడ్డారు. సామాజికతను తెరపైకి తెచ్చి గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. అటు ఉప రాష్ట్రపతి ఎన్నికలో సైతం వెంకయ్యకు రెన్యూవల్ లేదని స్పష్టత ఇచ్చినట్టు తెలిసింది. అందుకే వెంకయ్య కూడా అందుకు అనుగుణంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Also Read:Blood Cancer Treatment: బ్లడ్ క్యాన్సర్ చికిత్స ఖర్చు అమెరికా కంటే మన దగ్గరే తక్కువ ఎందుకంటే