Dolo-650: మైక్రో ల్యాబ్స్.. ఈ పేరంటే తెలియని వారు ఉండవచ్చు గాని.. డోలో 650.. బహుశా ఈ మాత్ర పేరు తెలియని వారు భారత దేశంలోనే ఉండరు. అంతలా చొచ్చుకుపోయింది ఈ మాత్ర. జ్వరం, జలుబు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులకు సత్వర ఉపశమనంగా ఈ మాత్ర పని చేస్తుంది. మార్కెట్లో ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ మైక్రో ల్యాబ్స్ రూపొందించిన డోలో 650 మాత్రం విజయవంతం అయింది. కోవిడ్ సమయంలో రెమిడేసివీర్ స్థాయిలో మైక్రో లాబ్స్ ఈ మాత్రాల అమ్మకాలు జరిపింది. పెద్దపెద్ద ఫార్మా కంపెనీలు సైతం అసూయ పడేలా విక్రయాలలో వృద్ధి సాధించింది. కానీ ఈ వృద్ధి అంతా తాయిలాలు ఇచ్చి మైక్రో ల్యాబ్స్ చేయించిందా? వైద్యులకు నజరానాలు ప్రకటించి రోగులకు బలవంతంగా అంటగట్టిందా? అంటే ఇందుకు అవుననే చెప్తున్నాయి ఈడీ వర్గాలు.
ఓవర్ నైట్ లో బిలియనీర్ అయ్యారు
డోలో 650 ని మైక్రోల్యాబ్స్ అనే సంస్థ తయారు చేస్తుంది. దీనిని దిలీప్ సురానా అనే వ్యక్తి బెంగళూరులో స్థాపించారు. వాస్తవానికి డోలో 650 అనేది కొత్త ఔషధం ఏమీ కాదు. కొత్త సీసాలో పాత సారా లాగా పారాసెటమాల్ కాంబినేషన్ తో చేసిన ఈ మాత్ర జ్వరం, కీళ్లు, కాళ్ళు, ఒళ్ళు నొప్పుల నివారణకు ప్రభావవంతం గా పని చేయడంతో దీనికి డిమాండ్ పెరిగింది. ఫార్మా అంటేనే ఓ దందా కదా! మార్కెట్ లో లీడర్ గా ఎదగాలని దిలీప్ సురానా చేయని ప్రయత్నం అంటూ లేదు. 8 స్ట్రిప్ లు కొంటె 2 స్ట్రిప్ లు ఉచితంగా ఇస్తామని ఆఫర్ పెట్టారు. దీంతో విక్రయాలు మంచిగానే పెరిగాయి. ఫలితంగా మైక్రో ల్యాబ్స్ విస్తరణ ప్రారంభం మొదలైంది. కానీ అది దిలీప్ సూరానా అనుకున్నంత స్థాయిలో మాత్రం కాదు. పోటీ కంపెనీలు విదేశాల్లో సైతం కార్యకలాపాలు సాగిస్తుండటంతో సురానా లో లోపల మదనపడేవాడు.
Also Read: BYJU’S: బైజూస్ కు భారీ డ్యామేజ్.. కారణాలు అవేనా?
కలిసి వచ్చిన కరోనా
కోవిడ్ 19 ప్రపంచం మొత్తాన్ని వణికిస్తే ఫార్మా కంపెనీలకు మాత్రం భారీగా లాభాలు ఇచ్చింది. అందులో ముందు వరుసలో ఉన్నది మైక్రోల్యాబ్స్. కరోనా ప్రారంభ సమయంలో జ్వరం రావడంతో చాలామంది కూడా డోలో 650ని విరివిగా వాడేవారు. దీంతో అమ్మకాలు జోరు అందుకున్నాయి. పైగా కరోనా నివారణకు మందులు రాకపోవడంతో డాక్టర్లు కూడా ఈ మాత్రనే సిఫారసు చేసేవారు. సరిగ్గా దీన్నే తన వ్యాపార సూత్రంగా మలచుకున్నారు సూరానా. ఇదే అదునుగా ప్రోడక్షన్ ను పెంచారు. ఇతర దేశాలకు సరఫరా ప్రారంభించారు. కానీ మన దేశంలోనే నంబర్ వన్ కావాలి అని సురానా కొత్త ప్లాన్ వేశారు. డోలో విక్రయాలు పెంచుకునేందుకు డాక్టర్లకు బల్క్ ఆఫర్ ఇచ్చింది మైక్రో ల్యాబ్స్. వాస్తవానికి ఈ విధానం ఎప్పటి నుంచో ఉన్నా మెక్రో ల్యాబ్స్ దాన్ని మరింత కమర్షియల్ చేసింది. అసలే కరోనా, పైగా బల్క్ ఆఫర్.. దీంతో కార్పొరేట్ నుంచి సాధారణ ఆసుపత్రుల వైద్యుల దాకా డోలో ను సిఫారసు చేశారు. దీంతో సురానా ఓవర్ నైట్ లో బిలియనీర్ అయ్యారు. రెడ్డీస్, సిప్లా, రాన్ బాక్సీ, కాడిలా, గ్లెన్ మార్క్స్ వంటి కంపెనీల స్థాయికి వచ్చాడు.
ఈడి ఎలా పసిగట్టింది
2020లో కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి 350 కోట్ల డోలో 650 మాత్ర విక్రయాల ద్వారా 400 కోట్ల ఆదాయాన్ని అర్జించినట్టు మైక్రోల్యాబ్స్ కంపెనీ సీఎండీ దిలీప్ సూరానా కంపె నీకి సంబంధించిన ఒక వెబ్సైట్లో పేర్కొన్నారు. అప్పటినుంచి ఆదాయపు పన్ను శాఖ కంపెనీపై ఒక కన్ను వేసింది. కంపెనీ సంపాదించిన ఆదాయానికి చెల్లించిన పన్నులకు పొంతన లేకపోవడంతో సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరు తో పాటు దేశంలోని మీద 19 కార్యాలయాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. పలు కీలకపాత్రలను స్వాధీనం చేసుకుంది. కోటిన్నర నగదు, విలువైన వజ్రాలను సీజ్ చేసింది. మైక్రో ల్యాబ్స్ కరోనా సమయంలో డోలో 650, అనాల్జేసిక్ అనే మాత్రలను డాక్టర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మెడికల్ షాప్ రిటేయిలర్ల ద్వారా అడ్డగోలుగా విక్రయించిందని ఈడి అధికారులు అంటున్నారు.
మొత్తంగా అనైతిక పద్ధతుల్లో విక్రయాలు పెంచుకునేందుకు డోలోకంపెనీ చేసిన కుట్ర బయటపడింది.డాక్టర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు లంచాలు ఇచ్చి మార్కెట్ పెంచుకున్నా.. పన్నులు కట్టక ఇప్పుడు కటకటాల పాలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎంత ఎదిగితే అంత ఒదగాలన్న సూత్రాన్ని గంగలో కలిపిన సురనా చివరకు జైలు పాలు అవ్వక తప్పడం లేదు.
Also Read:My Village Show Gangavva: వామ్మో గంగవ్వ.. రేంజ్ మామూలుగా లేదుగా