దేశ శ్రేయస్సు దృష్ట్యా మసీదులను మూసివేయాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాందే ముస్లింలను కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘దురదృష్ట వశాత్తు నిజాముద్దీన్ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాజ శ్రేయస్సు దృష్ట్యా స్వచ్ఛందంగా మసీదులను మూసేయండి. మతాన్ని పక్కనపెట్టి సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించండి. ఎందుకంటే కరోనా మహమ్మారిని తరిమి కొట్టాల్సిన అవసరం అందరి మీదా ఉంది.’’ అని మిలింద్ పిలుపునిచ్చారు.
ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వీటిని ఉల్లంఘించే మౌల్వీల వీసాలను రద్దు చేయడమే కాకుండా వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
రామ మందిరానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తర్వాత జరిగే మొదటి రామ నవమి వేడుకలని, అయినా సరే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హడావుడి లేకుండా నవమిని జరుపుకున్నామని ఆయన గుర్తు చేశారు. జాతికి ఎలాంటి హాని కలగకుండా చేయడమే ప్రస్తుతం అత్యుత్తమ ధర్మమని మిలింద్ పరాందే హితవు చెప్పారు.