Kapunadu Sabha: వచ్చే ఎన్నికలే టార్గెట్ గా కాపు సామాజికవర్గం సంఘటితమవుతోందా? రాజకీయంగా పెను మార్పులు దిశగా ఆ సామాజికవర్గం ఒకే తాటిపైకి వస్తుందా? ప్రధాన రాజకీయ పక్షాలకు ఒక మెసేజ్ ఇచ్చేందుకు కాపు నేతలు ప్రయత్నిస్తున్నారా? ఈసారి రాష్ట్ర సీఎం పదవి కాపులకే విడిచిపెట్టాలన్న డిమాండ్ తెరపైకి తెస్తారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ నెల 26న విశాఖలో కాపునాడు సమావేశం వెనుక ఉన్న అజెండా ఇదేనా? అన్న అనుమానం కలుగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు ఏపీలో కాపు కాక రగులుతోంది. కాపులను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. కాపు ఓటు బ్యాంక్ ను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే ఈ సారి ముందే అలెర్ట్ అయిన కాపు సామాజికవర్గం నేతలు బలమైన ఆకాంక్షను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు వంగవీటి మోహన్ రంగా వర్ధంతిని వేదికగా చేసుకుంటున్నారు.

ఈ నెల 26న రంగా 36వ వర్థంతి జరగనుంది. అదే రోజు విశాఖ కేంద్రంగా కాపునాడు సమావేశం నిర్వహించాలని రంగా, రాధ రాయల్ అసోసియేషన్ నిర్వహించింది. అయితే ఈ సమావేశం రాజకీయ రంగు పులుముకుంది. పక్కా పొలిటికల్ అజెండాతోనే సమావేశం నిర్వహిస్తున్నట్టు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. దాదాపు 50 వేల మందితో సమావేశం నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏఎస్ రాజా కళాశాల మైదానంలో నిర్వహించడానికి నిర్ణయించారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన కాపులను ఆహ్వానిస్తున్నారు. సమావేశానికి సంబంధించి పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవితో ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. కానీ ఆయన విదేశాల్లో ఉండడంతో పద్మశ్రీ సుంకర ఆదినారాయణతో కలిసి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అయితే దీనిపై రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి.
కాపులకు సంబంధించి ఏపీలో చాలా అసోసియేషన్లు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కాపు, తెలగ, బలిజ, ఒంటరిగా పిలవబడే కాపులను ఏకతాటిపైకి తెచ్చేందుకు గత కొద్దిరోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే అసోసియేషన్ లు నిర్వహిస్తూ వచ్చారు. అయితే రంగా, రాధా రాయల్ అసోసియేషన్ ది మాత్రం చాలా యాక్టివ్ రోల్. వంగవీటి మోహన్ రంగా, రాధాల వర్థంతి, జయంతి వేడుకలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న ఈ అసోసియేషన్ ఎప్పుడూ పొలిటికల్ విషయాల వైపు ఫోకస్ చేయలేదు. అటు వంగవీటి రాధాక్రిష్ణ సైతం ఒకటి., రెండుసార్లు తప్పి.. ఎప్పుడూ ఈ అసోసియేషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అటువంటి అసోసియేషన్ పొలిటికల్ అజెండాగా ఫస్ట్ టైమ్ కాపునాడు పేరిట భారీ కార్యక్రమానికి ప్లాన్ చేస్తుండడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.

పవన్ నేతృత్వంలోని జనసేనకు మద్దతు తెలిపేందుకే సమావేశమంటూ పొలిటికల్ సర్కిల్ లో ఒక ప్రచారమైతే నడుస్తోంది. పవన్ సీఎం క్యాండిడేట్ గా ప్రకటించాలని డిమాండ్ చేసే అవకాశాలైతే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు జనసేన టీడీపీతో వెళ్లినా పర్వాలేదు.. కానీ పవన్ ను సీఎం క్యాండిడేట్ అని డిక్లేర్ చేశాక పొత్తు పెట్టుకోవాలని తీర్మానించే అవకాశముంది. దానికి టీడీపీ ఒప్పుకోకుంటే మాత్రం బీజేపీతో కలిసి జనసేనను బలోపేతం చేయాలని నిర్ణయించే అవకాశమున్నట్టు కూడా ప్రచారం సాగుతోంది. అయితే కార్యక్రమ నిర్వాహకుడిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నీతానై వ్యవహరిస్తుండడంపై కూడా భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. కానీ విశాఖలో కార్యక్రమం నిర్వహణ వెనుక ఆయన పాత్ర చెప్పకనే చెప్పింది.
కానీ గంటా శ్రీనివాసరావు పార్టీ మారతారన్న ప్రచారం ఉంది. ఆయన అధికార పార్టీకి దగ్గరవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ దానిని ఖండించిన దాఖలాలు లేవు. ఇప్పుడదే నేత కాపునాడు పేరిట బలప్రదర్శనకు దిగుతుండడాన్ని అన్ని పార్టీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్లు అయితే ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. క్షేత్రస్థాయిలో బలమున్న పార్టీగా టీడీపీ పవన్ సీఎం అభ్యర్థిత్వాన్ని ముందుగానే ఒప్పుకుంటే అసలుకే ఎసరు వస్తుందని భావిస్తున్నారు. అయితే దీని వెనుక అధికార పార్టీ హస్తం ఉందన్న ప్రచారమూ నడుస్తోంది. కాపులను సంఘటితం కాకుండా.. వారి మధ్య చిచ్చు పెట్టడంతో పాటు జనసేన, టీడీపీ కలవకుండా నిలువరించేందుకు ప్రభుత్వమే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. సభ నిర్వహణకు ఏఎస్ రాజా కళాశాల యాజమాన్యం ముందుకు రాలేదని.. గంటా ఒప్పించారని తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రౌండ్ ఇచ్చే చాన్సే లేదని.. దీని వెనుక ముమ్మాటికీ ప్రభుత్వ హస్తం ఉందని తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు అందరి దృష్టి అంతా ఈ నెల 26 వైపే మళ్లింది. ఆ రోజు విశాఖలో కాపునేతలు ఏం చెప్పబోతున్నారు? మిగతా రాజకీయ పక్షాలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. పవన్ సీఎం క్యాండిడేట్ అయితే ఒకే. లేకుంటే టీడీపీకీ నో అని చెబుతారా? లేదా కాపులను దగా చేస్తున్న జగన్ సర్కారును గద్దె దించాలని పిలుపునిస్తారా? లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సపోర్టుతో ముందుకెళ్లాలని పవన్ కు సూచిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఈ పరిణామాలకు ఒక తుది రూపం రావాలంటే ఈ నెల 26 వరకూ ఆగాల్సిందే.