Sai Pallavi: సాయి పల్లవి కెరీర్ ని పలు అనుమానాలు చుట్టుముట్టాయి. ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయకపోవడం పుకార్లకు తెరలేపింది. సాయి పల్లవి సినిమాలు మానేశారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇకపై డాక్టర్ వృత్తిలో స్థిరపడుతున్నారంటూ వరుస కథనాలు వెలువడినా ఆమె నోరు విప్పలేదు. స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. సాయి పల్లవి మౌనం ఆమె అభిమానులను భయపెడుతుంది. సాయి పల్లవి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చివరి చిత్రం గార్గి. ఇది లేడీ ఓరియెంటెడ్ తమిళ డబ్బింగ్ మూవీ. దీంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

రానాకు జంటగా విరాట పర్వం మూవీ చేశారు. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ఆడలేదు. 2022లో సాయి పల్లవి నటించింది ఈ రెండు చిత్రాలు మాత్రమే. అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే 2021లో సాయి పల్లవి రెండు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. నాగ చైతన్యకు జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ ‘లవ్ స్టోరీ’ విజయం సాధించింది.
అనంతరం నానితో శ్యామ్ సింగరాయ్ మూవీలో నటించారు. శ్యామ్ సింగరాయ్ లో సాయి పల్లవి దేవదాసి రోల్ చేయడం విశేషం. ఈ మూవీతో సాయి పల్లవి గొప్ప నటిగా మరోసారి రుజువు చేసుకుంది. అయితే సాయి పల్లవి కొత్త చిత్రాలకు ఎందుకు సైన్ చేయడం లేదనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఏడాది కాలంగా సాయి పల్లవి కొత్త మూవీ ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో సాయి పల్లవి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారట. సినిమాలను పూర్తిగా వదిలేసి డాక్టర్ వృత్తిలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలపై సాయి పల్లవి మౌనం వహించడం భయపెడుతుంది. సాయి పల్లవి తన మౌనాన్ని బ్రేక్ చేసి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటామని అభిమానులు సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2 లో సాయి పల్లవి నటిస్తున్నారంటూ ఒక వాదన తెరపైకి వచ్చింది. అలాగే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణానికి సైన్ చేశారట. రన్బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి సీత పాత్ర చేస్తున్నారని అంటున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ లో హృతిక్ రోషన్ రావణుడు పాత్ర చేస్తున్నాడట. అయితే ఇవన్నీ అనధికార వార్తలు మాత్రమే.