Vande Bharat Trains: వందేభారత్‌ సరికొత్తగా.. కొత్తగా 25 ఫీచర్లు.. భారతదేశ సాంకేతిక ప్రగతికి ప్రతీక!

పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్న వందేభారత్‌ రైళ్లు భారత సాంకేతిక అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో మరిన్ని రైళ్లు మరింత ఆధునిక టెక్నాలజీలో అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Written By: Suresh, Updated On : July 10, 2023 11:44 am
Follow us on

Vande Bharat Trains: వందేభారత్‌..పూర్తి భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సెమీ హైస్పీడ్‌ రైలు. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అన్ని మార్గల్లో ఈ రైళ్లు నడిపేందుకు శ్రీకారం చుట్టారు. బుల్లెట్‌ రైళ్ల స్థానాన్ని వందేభారత్‌ ఆక్రమిస్తున్నాయి. దీంతో ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తోంది. మొదట్లో చార్జీలు ఎక్కువగా ఉన్నాయని కొంత నిట్టూర్చినా అందులోని ఆధునిక సౌకర్యాలు చూసి చార్జీ ఎక్కువైనా వందేభారతే ఎక్కాలనుకుంటున్నారు. ఆధునిక సౌకర్యాలు, భద్రత, ఇతర సౌకర్యాలపై ప్రయాణికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత రైల్వేను అభినందిస్తున్నారు.

సరికొత్తగా వందేభారత్‌..
పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్న వందేభారత్‌ రైళ్లు భారత సాంకేతిక అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతుండడంతో మరిన్ని రైళ్లు మరింత ఆధునిక టెక్నాలజీలో అందుబాటులోకి తెచ్చేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవుతున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ల కొత్త వెర్షన్‌లో 25 అధునాతన భద్రతా సౌకర్యాలు కల్పించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కొత్త సౌకర్యాలను రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో మార్పులు చాలా బాగున్నాయి. కొత్తగా 25 సేఫ్టీ ప్రికాషన్స్‌తో కొత్త రైళ్లు రాబోతున్నాయి’ అని తెలిపారు.

వందే భారత్‌లో కొత్త ఫీచర్లు ఇవే..
– సీటు సైజులో పెరుగుదల
– సీట్లకు మెరుగైన కుషన్‌
– మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్‌లకు మెరుగైన ప్రాధాన్యత
– ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్లలో విస్తరించిన ఫుట్‌రెస్ట్‌లు
– నీటి వృథాను నివారించడానికి పెరిగిన లోతుతో వాష్‌బేసిన్‌
– టాయిలెట్లలో మెరుగైన లైటింగ్‌
– డ్రైవింగ్‌ ట్రెయిలర్‌ కోచ్‌లలో దివ్యాంగ ప్రయాణీకులు ఉపయోగించే వీల్‌చైర్‌లకు ఫిక్సింగ్‌ పాయింట్ల ఏర్పాటు
– సులభమైన ఉపయోగం కోసం రెసిస్టివ్‌ టచ్‌ నుంచి కెపాసిటివ్‌ టచ్‌కి రీడింగ్‌ ల్యాంప్‌.
– మెరుగైన రోలర్‌–బ్లైండ్‌ ఫాబ్రిక్‌
– మెరుగైన భద్రత కోసం బోగీల వద్ద కొత్త యాంటీ–క్లైంబింగ్‌ పరికరం అమర్చబడుతోంది.

కొత్త రంగులో..
చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తిలో ఉన్న 28వ వందేభారత్‌ రైలు కొత్త రంగుల్లో పట్టాలెక్కనుంది. ‘భారతీయ త్రివర్ణ పతాక స్ఫూర్తితో’ కుంకుమ రంగులో ఉంటుంది. ఈమేరకు చెనై్నలో తయారైన రైలు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో కొత్త రైళ్లు..
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ స్టేషన్‌లో గోరఖ్‌పూర్‌–లక్నో మరియు జోధ్‌పూర్‌–సబర్మతి మధ్య ఈ కొత్త వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పరుగులు పెట్టనున్నాయి. ఈనెల 15 ప్రధాని మోదీ వీటిని ప్రారంభిస్తారు. దేశంలోని మొట్టమొదటి సెమీ–హై–స్పీడ్‌ రైలు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను 2019లో న్యూఢిల్లీ నుంచి వారణాసికి నడిపారు. దానిని కూడా మోదీ ప్రారంభించారు.