Gannavaram Constituency: ఏపీలో గన్నవరం నియోజకవర్గం వైసీపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరిన తరువాత గన్నవరం రాజకీయాలు ఆసక్తిగా మారాయి. అప్పటి వరకూ వైసీపీ బలోపేతానికి క్రుషి చేసిన నాయకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వంశీ రాకను వైసీపీలో మెజార్టీవర్గం వ్యతిరేకిస్తోంది. అధికార టీడీపీలో ఉన్నప్పుడు వంశీ పెట్టిన ఇబ్బందులే ఇందుకు కారణం. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి యార్లగడ్డ వెంకట్రావు కు మధ్య రాజకీయ విభేదాలున్నాయి. వంశీ వైసీపీలోకి రావడంతో మరింత ముదిరిపాకాన పడ్డాయి. పరస్పరం రెండు వర్గాలు దాడులకు సైతం తెగబడ్డాయి. మరోవైపు వల్లభనేని వంశీకి వైసీపీ నేత దుట్టా రామచంద్ర రావు సైతం విభేదిస్తున్నారు. వీరి మధ్య గత కొంత కాలంగా గ్రూప్ తగాదాలు నడుస్తున్నాయి. ఇక తాజాగా గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వారి మధ్య విబేధాలు బట్టబయలయ్యాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ వ్యతిరేక వర్గమంతా వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే తామంతా కలిసి ఓడించి తీరుతామని శపథం చేసింది. ఇదే విషయాన్ని పార్టీలో అగ్రనేత విజయసాయిరెడ్డికి స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తామని లేఖల ద్వారా స్పష్టం చేశారు.

సఫలం కాని ప్రయత్నాలు..
గన్నవరం నియోజకవర్గంలో నేతల మధ్య ఉన్న విభేదాలపై అధిష్టానం ద్రుష్టిపెట్టింది. సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించింది. కానీ ప్రయత్నలేవీ సఫలం కాలేదు. తాజాగా వల్లభనేని వంశీకి దుట్టా రామచంద్ర రావుకు మధ్య చోటు చేసుకున్న గ్రూప్ తగాదాల పంచాయితీ సీఎంవో వరకు వెళ్ళింది. దీంతో వారిద్దరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. మొదట వీరి పంచాయితీని పరిష్కరించడం కోసం బుధవారం రావాలని చెప్పినప్పటికీ, ఆ తర్వాత గురువారం సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి రావాలని సీఎంవో సూచించింది. ఇద్దరి వ్యవహారాన్ని త్వరగా తేల్చేయాలని సీఎం జగన్ అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వీరిద్దరి పంచాయితీ సీఎం ముందుకు రానుంది.
తాడేపల్లి సాక్షిగా సీఎం జగన్ వీరి పంచాయతీ పై ఏం చేస్తారన్నది ప్రస్తుతం నియోజకవర్గంలో జోరుగా జరుగుతున్న చర్చ.అయితే ఈ పరిణామాలను టీడీపీ ఆసక్తిగా చూస్తోంది. వంశీ పార్టీని విభేదించడంతో పాటు చంద్రబాబు, లోకేష్ లపై ఎప్పటికప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని టీడీపీ సీరియస్ గా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వంశీని గన్నవరం నియోజకవర్గంలో తెగ్గొట్టాలని నిశ్చయించుకుంది. అందుకే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదు. మరోవైపు ఎన్నికల నాటికి వంశీ తిరిగి టీడీపీ గూటికి చేరిపోతారన్న వాదన ఉంది. అయితే అధిష్టాన పెద్దలు మాత్రం వంశీ విషయంలో ఏమంత అనుకూలంగా లేరు.

వంశీకి పార్టీ పగ్గాలివ్వొద్దు..
టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరిన వల్లభనేని వంశీ తన సొంత వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, కార్యకర్తలను, నేతలను పట్టించుకోవడం లేదు అన్నది ప్రధానంగా వైసిపి వర్గం నుండి వస్తున్న ఆరోపణ. ఈ క్రమంలోనే గన్నవరం వైసిపి ఇన్చార్జిని నియమించాలని వైసిపి కార్యకర్తలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వల్లభనేని వంశీ ని పక్కన పెట్టి నిజమైన వైసిపి నాయకులకు ఇన్చార్జిగా బాధ్యతలు ఇవ్వాలని వైసిపి కార్యకర్తలు అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే సాధారణంగా నియోజకవర్గ ఇన్చార్జికే, టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ అవకాశం తనకు ఇవ్వాలని వల్లభనేని వంశీ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంవోలో గురువారం సాయంత్రం జరిగే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే వైసీపీ ముఖ్యనేతలు గన్నవరం పంచాయితీ పరిష్కరించటానికి అనేక ప్రయత్నాలు చేశారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఉన్న వీరి పంచాయితీ పరిష్కరించలేక చేతులెత్తేశారు. ఇక ఇప్పుడు వీరి పంచాయితీ సీఎంవో కు చేరింది. ఇక పాత, కొత్త నేతల డిమాండ్లతో ఏపీ సీఎం ఏం చేయబోతున్నారు అన్నది ఈరోజు సాయంత్రం తేలుతుంది.
Also Read:Child Marriages In AP: బాల్య వివాహాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్.. తెలంగాణ స్థానం ఏంటో తెలుసా?
[…] […]