Vadodara Bridge Collapse : గుజరాత్ రాష్ట్రంలోని వడదర గంభీర వంతెన కూలి పదిమంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ వంతెన కూలిన నేపథ్యంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వంతెన పరిస్థితిపై గతంలోనే కొంతమంది పాత్రికేయులు గ్రాండ్ రిపోర్టింగ్ చేశారు. ఈ నేపథ్యంలో వారు తమ రిపోర్టింగ్ లో వెల్లడించిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి..
వడోదర ప్రాంతంలో గంభీర వంతెన కూలిపోయి పదిమంది దుర్మరణం చెందారు. ఈ వంతెన అనుకున్న స్థాయిలో పటిష్టంగా లేదట. వంతెన మీద పగుళ్లు ఏర్పడ్డాయట. గుంతలు కూడా చోటుచేసుకున్నాయట. సరిగ్గా తొమ్మిది రోజుల క్రితం ఓ న్యూస్ ఛానల్ రిపోర్టర్ ఈ వంతెన పరిస్థితి పై గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాడు. వంతెన ఏమాత్రం బాగోలేదని.. దారుణంగా పగుళ్ళు ఏర్పడ్డాయని.. వంతెన నాణ్యంగా లేకపోవడం వల్ల రాకపోకలను నిలిపివేయడం ఉత్తమం అని అతడు ఆ రిపోర్టులో పేర్కొన్నాడు. కానీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వంతెనపై మరింత పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఆ వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
సరిగ్గా మూడు నెలల క్రితం ఈ వంతెనపై క్రాక్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఓ న్యూస్ ఛానల్ రిపోర్టింగ్ చేసింది. వంతెన పరిస్థితి బాగోలేదని.. సాధ్యమైనంత వరకు దీనిపై రాకపోకలు నిలిపివేయడం ఉత్తమమని పేర్కొంది. ఇదే విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లింది. అయితే వారు ఈ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా వంతెనకు ఏమీ కాదు అనే ధీమాలో ఉన్నారు. చివరికి వంతెన కుప్పకూలిపోవడంతో పదిమంది దుర్మరణం చెందారు. వంతెన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని స్థానికులు అంటున్నారు.. వంతెన నిర్మించినప్పుడు అధికారులు సరిగా పర్యవేక్షించలేదని.. నాణ్యతను నేతిబీరను చేశారని అందువల్లే వర్షాకాలంలో పగుళ్లు ఇచ్చిందని.. చూస్తుండగానే కూలిపోయిందని స్థానికులు వాపోతున్నారు.
మహి సాగర్ మీద నిర్మించిన ఈ వంతెన వడోదర, ఆనంద్ జిల్లాల ప్రజలకు అత్యంత ముఖ్యమైనది. ఈ వంతెన ఈ రెండు జిల్లాల మధ్య సంధానకర్తగా ఉంటుంది. ఈవంతెన మీదుగానే ఈ రెండు జిల్లాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. తమ తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు.. దీనికంటే ముందు ఇటీవల మోర్బి ప్రాంతంలో ఓ వంతెన కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో 140 మందికి పైగా దుర్మరణం చెందారు. ఇలా తరచుగా వంతెనలు కూలిపోతున్న ఘటనలు గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. ఇవే విషయాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వివిధ మాధ్యమాలలో ప్రస్తావిస్తోంది. అవినీతి.. నాణ్యత లేకపోవడం వల్లే వంతెనలు కూలిపోతున్నాయని ధ్వజమెత్తుతోంది. ఇప్పటికైనా డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ మాటలు పక్కనపెట్టి.. చేస్తున్న పనుల్లో నాణ్యతను పాటించాలని కాంగ్రెస్ నాయకులు బిజెపి నేతలకు హితవు పలుకుతున్నారు.