India vs England : రెండో టెస్టులో ఓటమి తర్వాత ఒక్కసారిగా ఇంగ్లాండ్ జట్టుకు వాస్తవం బోధపడింది. తొలి టెస్ట్ లో మా బౌలింగ్ భీకరంగా ఉంది.. మా బౌలర్లు అద్భుతాలు చేస్తారని ఇంగ్లాండ్ సారధి గొప్పగా చెప్పాడు. ఇంగ్లాండ్ సారధి చెప్పినట్టుగా బౌలర్లు బౌలింగ్ వేయలేకపోయారు. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్ లో చేతులెత్తేశారు. దీంతో భారత బ్యాటర్లు పండగ చేసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లోనూ భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా కెప్టెన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేశాడు. తద్వారా భారత జట్టుకు కొండంత స్కోర్ అందించాడు.
ఇంగ్లాండ్ బౌలర్లు రెండో టెస్టులో దారుణంగా బౌలింగ్ వేసిన నేపథ్యంలో జట్టులో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకురావడానికి ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. రేపటి నుంచి లార్డ్స్ వేదికగా మూడవ టెస్ట్ మొదలవుతున్న నేపథ్యంలో జట్టులో ఒక కీలకమార్పు తీసుకొచ్చింది. అయితే అధికారికంగా ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని ప్రకటించలేదు. ఇంగ్లాండ్ మీడియాలో, ఇండియా జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మూడవ టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టులోకి కీలక బౌలర్ ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.
ఇంగ్లాండ్ జట్టులో టంగ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తారని తెలుస్తోంది. అతని స్థానంలో స్టార్ పేస్ బౌలర్ జోప్రా ఆర్చర్ ను జట్టులోకి తీసుకుంటున్నారని తెలుస్తోంది. అతడు గనుక జట్టులోకి వస్తే ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్ అవుతుందని ఇంగ్లీష్ అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే లార్డ్స్ లో గ్రీన్ పిచ్ ఉంటుంది. దీంతో ఆర్చర్ కీలకమైన బౌలర్ గా మారే అవకాశం కనిపిస్తోంది. ఆర్చర్ టెస్టు జట్టుకు నాలుగు సంవత్సరాలుగా దూరంగా ఉన్నాడు. భారత జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కి ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ అతడిని ఎంపిక చేసింది. దీంతో టంగ్ ప్లేస్ లో అతడికి అవకాశం దక్కుతుంది.
ఆర్చర్ ఇటీవల ఐపీఎల్లో ఆడాడు. అతడికి భారత బ్యాటర్లకు బౌలింగ్ వేసిన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని మూడో టెస్టులో ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. యార్కర్లు వేయడంలో ఆర్చర్ సిద్ధహస్తుడు. ముఖ్యంగా బాన్సర్లు.. హాఫ్ సైడ్ బంతులను అతడు అత్యంత చాకచక్యంగా వేస్తాడు. అందువల్లే అతడిని జట్టులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టంగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్ లోనూ రెండు వికెట్లు సాధించాడు. అయితే అతడిని ఎందుకు పక్కన పెడుతున్నారు అనే విషయంపై మేనేజ్మెంట్ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు కార్సే, వోక్స్ అంతగా రాణించడం లేదు. వాస్తవానికి మూడో టెస్టులో వీరిద్దరిలో ఎవరో ఒకరిపై వేటు పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరిని జట్టులో ఉంచి టంగ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయడం పట్ల ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ పై విమర్శలు వస్తున్నాయి.