
రాష్ట్రాలకు పంచే కరోనా వ్యాక్సిన్లపై తాజాగా కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇవి చూస్తే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసే వ్యాక్సిన్లలో భారీగానే కోతపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా అధిక జనాభా, వ్యాధి తీవ్రత, కేసుల సంఖ్య ఆధారంగా పంచుతామని ప్రకటించడంతో.. అస్సలు కేసులు లేవని దాచేసిన తెలంగాణ సర్కార్ కు ఇప్పుడు కేంద్రం మార్గదర్శకాలతో టీకాలు రాని పరిస్థితి నెలకొంది.
జాతీయ వ్యాక్సినేషన్ విధానంపై మంగళవారం కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ముందుగా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే కేంద్రం ఎక్కువ డోసులు ఇవ్వనుంది. అలాగే టీకాల వృథా ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుంది. దీంతో తెలంగాణకు తక్కువ టీకాలు సరఫరా చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక తెలంగాణలో ఎక్కువగా ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. ఇప్పటికే అవి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాయి. ఇక జనాభా పరంగానే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువే. ఏపీ కంటే కూడా తక్కువే. ఏపీ కేసుల కంటే కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సినేషన్ లో కేంద్రం తెలంగాణను విస్మరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.