
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి వ్యాక్సినే ప్రధాన అస్త్రమని ప్రపంచ దేశాలు భావించాయి. అందుకు అనుగుణంగా ఆయా దేశాలు వ్యాక్సిన్లు ఇచ్చే పనిలో బిజీగామారాయి. ఇండియాలోనూ వ్యాక్సిన్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20 శాతానికి పైగా వ్యాక్సినేషన్ జరిగిందని, ఇంకా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయితేనే కరోనా వైరస్ ను తరిమికొట్టగలమని వైద్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో కొందరు వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అపోలో గ్రూప్ సంస్థలు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఇన్ ఫెక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో తెలుసుకోవడానికి అధ్యయనం చేశాయి. వ్యాక్సిన్లతో కరోనానూ పూర్తిగా తరమిగొట్టవచ్చని ఆ గ్రూపు సంస్థల ప్రతినిధులు తెలుపుతున్నారు. అందుకు సంబంధించిన వివరాలను వారు బయటికి తెలిపారు. వారు చేసిన అధ్యయనం ప్రకారం ..దేశవ్యాప్తంగా 24 నగరాల్లో 43 అపోలో ఆసుపత్రుల్లో దాదాపు 31,621 మందిపై అధ్యయనం జరిపారు.
వీరిలో కోవిషీల్డు, కోవాగ్జిన్ మొదటి, రెండు డోసులు తీసుకున్న 95 శాతం సిబ్బందిపై ఎలాంటి ఇన్ ఫెక్షన్ తీసుకోలేదని తెలిపారు. వీరిలో కేవలం ముగ్గురికి మాత్రమే వైరస్ సోకి ఐసీయూ అవసరమైందన్నారు. వారు కూడా తరువాత కోలుకున్నట్లు తెలిపారు. ఈఏడాది జనవరి నుంచి మే 30 వరకు ఈ అధ్యయనం జరిగింది. ఇందులో వ్యాక్సిన్ తీసుకున్న 31,621 హెల్త్ సిబ్బందిని తీసుకున్నారు.
వీరిలో కోవిషీల్డు తీసుకున్న వారు 28,918, కోవాగ్జిన్ తీసుకున్నవారు 2703 ఉన్నారు. అలాగే రెండు డోసులు పూర్తయిన వారు 25,907 మంది ఉండగా.. మొదటి డోసు వేసుకున్నవారు 5,714 మంది ఉన్నట్లు తెలిపారు. ఇక రెండు డోసులు తరువాత కరోనా సోకని వారు 30, 266 మంది ఉండగా ఆసుపత్రిలో చికిత్స అవసరమైనవారు 90 మంది ఉన్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. వీరిలో 42 మంది మహిళలు, 48 మంది పురుషులు ఉన్నారు. కాగా ఒక్క మరణం కూడా జరగలేదు.