దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. ఇక్కడ గెలుపు సాధిస్తే.. దేశం మొత్తం మీద పట్టు సాధించినట్టే అన్నది జాతీయ పార్టీల అభిప్రాయం. అందుకే.. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఈ రాష్ట్రంలో అధికారం సాధించింది బీజేపీ. కానీ.. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులైందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల అక్కడ నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికలే ఈ విషయాన్ని చాటి చెప్పాయి.
సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటుతుంది. కానీ.. యూపీలో అందుకు విరుద్ధంగా జరిగింది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. విపక్షాలు సత్తా చాటాయి. బీజేపీ తమ ఓటు బ్యాంకుగా భావించే రామ మందిరం నిర్మిస్తున్న అయోధ్యలోనూ కమలం వాడిపోయింది. ఆఖరికి నరేంద్ర మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసిలో కూడా ఓడిపోయింది. దీంతో.. కమలనాథుల్లో కవలవరం మొదలైంది. వచ్చే ఏడాదే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక ఎన్నికల ప్రభావం పడితే.. ఓడిపోవడమే తప్పదనే భయం వారిని వెన్నాడుతోంది.
ఈ పరిస్థితిని అధిగమించేందుకు బీజేపీ నేతలతోపాటు సంఘ్ పెద్దలు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఆ మధ్య వరుస భేటీలు నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అనే విషయమై వాడీవేడిగా చర్చలు సాగించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే.. ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది. అదే.. ఉత్తర ప్రదేశ్ విభజన.
విస్తీర్ణం పరంగా.. జనాభా పరంగా.. ఎలా చూసుకున్నా ప్రపంచంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. విస్తీర్ణంలో చాలా దేశాలు యూపీ కన్నా చిన్నవి. మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణకన్నా ఐదారు రెట్లు పెద్దది. ఏపీకన్నా నాలుగు రెట్లు పెద్దది. ఇలాంటి ఉత్తర ప్రదేశ్ ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి వంటి వారు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇప్పుడు ఇదే అంశం గురించి బీజేపీ సీరియస్ గా ఆలోచిస్తోందని టాక్.
యూపీలో చాలా పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ మినహా.. మిగిలినవన్నీ ప్రాంతీయ పార్టీలే. అందువల్ల రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. తమకే లాభిస్తుందని బీజేపీ భావిస్తోందట. అంటే.. నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తే.. ప్రాంతీయ పార్టీల అధినేతలు ఏ రాష్ట్రంలోనైతే ఉంటారో.. వారి ప్రభావం ఆ రాష్ట్రానికే పరిమితం అవుతుందని, మిగిలిన ప్రాంతాల్లో జాతీయ పార్టీలే సత్తా చాటే అవకాశం ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట.
ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఏపీ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో సత్తా చాటిన చంద్రబాబు.. ఇప్పుడు ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. జగన్ పార్టీ పరిస్థితి కూడా ఇంతే. ఇదే ఫార్ములా యూపీలోనూ వర్కవుట్ అవుతుందని.. అప్పుడు అఖిలేష్, మాయావతి వంటి వారి ప్రభావం ఒక రాష్ట్రానికే పరిమితం అవుతుందని, జాతీయ పార్టీలకు ఆ సమస్య ఉండదని, ఇది ఇప్పుడు కాకపోయినా.. ఫ్యూచర్ లోనైనా కలిసి వస్తుందని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారట. కాంగ్రెస్ పని ఎలాగో అయిపోయిందని, ఇక మిగిలిన ఏకైక జాతీయ పార్టీగా తమదే హవా అని భావిస్తున్నారట. ఈ కోణంలో యూపీని విభజించాలని తీవ్రంగానే ఆలోచిస్తున్నారట. మరి, ఇందులో వాస్తవం ఎంత? ఎప్పుడు కార్యరూపం దాలుస్తుంది? ఈ నిర్ణయంపై విపక్షాలు ఏమంటాయి? అనేది చూడాలి.