Lakhimpur khiri: లఖింపూర్ ఘటనలో ఉగ్రకోణం!? ‘యూపీ ఎన్నికల’ వేళ బీజేపీని ఇరికించారా?

Lakhimpur khiri: దేశ రాజకీయాలను ప్రస్తుతం లఖింపూర్ ఖేరి ఘటన షేక్ చేస్తోంది. రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హింసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు, రైతుల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే యూపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బలమైన బీజేపీని టార్గెట్ చేస్తున్న  ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక కుట్రదారులు ఉన్నారని ఆరోపిస్తున్నాయి. రైతులను తొక్కి చంపిన […]

Written By: NARESH, Updated On : October 5, 2021 1:10 pm
Follow us on

Lakhimpur khiri: దేశ రాజకీయాలను ప్రస్తుతం లఖింపూర్ ఖేరి ఘటన షేక్ చేస్తోంది. రాజకీయవర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హింసాత్మక ఘటనపై ప్రతిపక్షాలు, రైతుల సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే యూపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బలమైన బీజేపీని టార్గెట్ చేస్తున్న  ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక కుట్రదారులు ఉన్నారని ఆరోపిస్తున్నాయి. రైతులను తొక్కి చంపిన వైనం ఇప్పుడు యూపీ ఎన్నికల వేళ బీజేపీకి మైనస్ గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నిరసనల్లో భాగంగా అప్పుడప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక్కడ జరిగిన ఆందోళనలో 8 మంది మరణించారు. ఈ సంఘటనకు కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ ప్రతిపక్షాలు లఖింపూర్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడా అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేత ప్రియాంకా గాంధీని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అలాగే యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను పోలీసులు నిర్బంధించారు.

-వివాదం ఇదీ..
ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించడానికి లఖింపూర్లో ఖేరీలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తో కలిసి మరో కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్లారు. ఈ తరుణంలో డిప్యూటీ సీఎం పర్యటన గురించి తెలుసుకున్న రైతులు నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో టికునియా పట్టణంలో రైతులు భారీగా తరలిరావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొందరు బీజేపీ నాయకులు వాహనంలో రాగా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఓ బీజేపీ నేత కారు ఆగకుండా ముందుకెళ్లారు. ఆ కారు రైతులను ఢీకొడుతూ వెళ్లింది. ఈ ఘటనలో పలువురు రైతులు మరణించారు. రైతులపై బీజేపీ నేతలు కారుతో తొక్కించడంతో ఆగ్రహించిన రైతన్నలు కారులో ఉన్న వారిని బయటకు లాగి చితక్కొట్టి చంపేశారు.

ఆందోళనలో నలుగురు రైతులు, ముగ్గురు బీజేపీ కార్యకర్తలు సహా మొత్తం 8 మంది మరణించారు. కారు కింద పడి ఇద్దరు వ్యక్తులు చనిపోగా, వాహనం బోల్తాపడి మరో ముగ్గురు మరణించారని లఖింపూర్ జిల్లా కలెక్టర్ అరవింద్ చౌరాసియా తెలిపారు. ఈ సంఘటనలో మొత్తం 8 మంది చనిపోయారని జిల్లా అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ ప్రకటించారు. చనిపోయిన వారిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. కాగా ఈ సంఘటన దురదృష్టకరమని సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పోలీసులను ఆదేశించారు.

లఖింపూర్ సంఘటనపై ప్రతిపక్షాలు బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ లో నిరసన తెలిపారు. ‘ రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారుతో ఢీకొట్టడం అవమానకరం. బీజేపీ వాళ్ల జులుంకు ఇదే నిదర్శనం ’ అని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సైతం ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ‘ దేశంలో రైతులను బీజేపీ ఎంత ద్వేషిస్తుందో ఈ సంఘటన ద్వారా అర్థమవుతోంది. రైతులకు జీవించే హక్కు లేదా..? ఇది రైతుల దేశం.. బీజేపీ క్రూరమైన భావజాలానికి జాగీరు కాదు’ అని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ సైతం ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు లఖింపూర్ కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు.

ఇక బీజేపీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. లఖింపూర్ ఘటనలో ఉగ్రకోణం ఉందని.. రాబోయే యూపీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోలేక కావాలనే ఇలా చేశారని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. యూపీలో ఈసారి ఎలాగైనా గెలవాలనుకున్న బీజేపీని దెబ్బకొట్టడానికి కొందరు ఉగ్రవాదులు చొరబడి ఇలా కుట్రకు పాల్పడి హింస జరగడానికి కారణమయ్యారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కశ్మీర్ నేతలు తాజాగా స్పందించడాన్ని బీజేపీ తప్పుపడుతోంది. యూపీ వ్యవహారాలపై కశ్మీర్ నేతలు ఒమర్ అబ్దుల్లా, ఫరుఖ్ అబ్దుల్లాలు తీవ్ర విమర్శలు చేశారు. యూపీని కశ్మీర్ లా మారుస్తున్నారని ఆరోపించారు. దీనిపై బీజేపీ భగ్గుమంది. యూపీలో లఖింపూర్ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక లఖింపూర్ ఖేరి ఘటనపై యూపీ ప్రభుత్వం స్పందించింది. రైతు సంఘాలతో చర్చలు జరిపింది. ఈ ఘటన ఎఫ్ఐఆర్ లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడి పేరును చేర్చారు. దోషులందరికీ కఠిన శిక్షలు వేస్తామని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇక లఖింపూర్ ఘటనలో మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.45 లక్షల పరిహారం చెల్లించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గాయపడిన వారికి రూ.10లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇక బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వనున్నట్టు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో న్యాయ విచారణకు ఆదేశించింది.

-లఖింపూర్ లో రైతులకు వాహనం దూసుకెళ్లిన వీడియో