Uttar Pradesh: వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ తమ వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. విజయం కోసం పావులు కదువుతున్నాయి. దేశంలోనే పెద్ద రాష్ర్టం కావడంతో ఇక్కడ గెలిస్తేనే భవిష్యత్ ఉంటుందని భావిస్తున్న నేతలు తమ పార్టీలను విజయతీరాలకు చేర్చాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే పలు విధానాలు రూపొందిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు తయారవుతున్నాయి.
కాంగ్రెస్ మాత్రం తమ రామబాణాన్ని తయారు చేస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించి ఈసారి పరువు నిలుపుకోవాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ నావను గట్టెక్కించే నేత కోసం తాపత్రయపడుతోంది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని నమ్ముకున్నా పార్టీ ఓటమి అంచులోనే ఉండిపోయింది. కానీ ఈసారి అలా కాకుండా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రాతో పార్టీని తమ సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ లోని అమేథీ లేదా రాయ్ బరేలీ నుంచి పోటీకి దిగుతారని ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో అమేథీ పార్లమెంట్ నుంచి పోటీకి దిగిన రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో పరాభవం చెందారు. దీంతో ఇప్పుడు అక్కడే గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. పైగా ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరు కూడా పోటీ చేయలేదు. ప్రియాంక పోటీ చేస్తే ఆమె మొదటి నాయకురాలు అవుతారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రూ.11 వేలు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలని నాయకులు సూచిస్తున్నారు. దీంతో వారి పేరు నమోదు చేయబడి టికెట్ ఇచ్చే విషయంలో ఎంత మేరకు విజయం సాధిస్తారో అనే దానిపైనే దృష్టి సారించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దరఖాస్తుల చివరి తేదీ ఈనెల 25 వరకు ఉందని సమాచారం. దీంతో ఆశావహులు అప్పుడే దరఖాస్తులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, బీఎస్పీ మధ్య సయోధ్య నెలకొన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. బీజేపీ సమావేశాల్లో బీఎస్పీని ప్రశంసిస్తున్నట్లు తెలుస్తుండడంతో రెండు పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అంత సునాయాసంగా దక్కదనే విషయం తెలుస్తోంది. పార్టీలు కూడా తమదైన శైలిలో ప్రచారం చేసేందుకు పాటుపడుతున్నట్లు సమాచారం.