Maha Kumbh Mela 2025: వాయు కాలుష్యం అనగానే మనకు ఢిల్లీ(Delhi) గుర్తొస్తుంది. అక్కడ ప్రజలు తక్కువే అయినా.. పొరుగున ఉన్న పంజాబ్ నుంచి వచ్చే కాలుష్యంతో ఢిల్లీలో గాలి నాణ్యత దెబ్బతింటోంది. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్(Uttara Pradesh)లో మహా కుంభమేళా జరుగుతోంది. 45 రోజులపాటు జరిగే ఈ వేడుకకు ఇప్పటికే 10 కోట్ల మంది వచ్చారు. ఇంకా 40 కోట్ల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా. అయితే ఇంత మంది వచ్చినా అక్కడి గాలి నాణ్యత ఏమాత్రం దెబ్బతినడం లేదు. అందుకు కారణం కుంభమేళాలో ఉపయోగిస్తున్న జపాన్ టెక్నిక్ కారణం. అక్కడ మియావాకీ పద్ధతిలో అభివృద్ధి చేసిన అడవుల కారణంగా కుంభమేళాకు వచ్చే భక్తులంతా స్వచ్ఛమైన గాలి పీలుస్తున్నారు. యూపీ ప్రభుత్వం ప్రయాగ్‌రాజ్‌లోని 10 చోట్ల 30 బిఘాల భూమిలో ఐదు లక్షల చెట్లు నాటింది. ఈ చెట్లు రోజుకు 11.5 కోట్ల లీటర్ల ఆక్సీజన్ విడుదల చేస్తున్నాయి. ఇందుకు రూ.6 కోట్లు వెచ్చించింది.
రెండేళ్లుగా మొక్కల పెంపకం..
ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్ టెక్నాలజీని ఉపయోగించి అడవులను సృష్టించింది. మహా కుంభమేళాను దృష్టిలో పెట్టుకుని రెండేళ్ల క్రితం మొక్కలు నాటడం ప్రారంభించారు. ప్రస్తుతం మొక్కలు 25 నుంచి 30 అడుగుల ఎత్తు పెరిగాయి. ఒక చెట్టు రోజుకు 230 లీటర్ల ఆక్సిజన్ విడుదల చేస్తుందని ప్రయాగ్‌రాజ్ మున్సిపల్ కార్పొరేషన్(Prayagraj Muncipal Corpotretion) పర్యావరణ ఇంజినీర్ ఉత్తమ్‌కుమార్ తెలిపారు. మియావాకి పద్ధతిలో 70 వేల చదరపు మీటర్లలో భూమిలో మర్రి, పీపల్, వేప, మహువా, మామిడి, చింతతోపాటు 63 రకాల మొక్కలు పెంచారు. అడవులను సృష్టించేందుకు కాంట్రాక్టు సంస్థ మూడేళ్లపాటు చెట్ల సంరక్షణ చూసుకుంటోంది.
పండ్లు, ఔషధ మొక్కలు కూడా..
మియావాకీ అడవుల్లో ఔషధ మొక్కలతోపాటు పండ్ల మొక్కలు కూడా నాటారు. అలంకారమైన, ఔషధ మొక్కలలో మామిడి, మహువా, వేప, పీపల్, చింతపండు, అర్జున్, టేకు, తులసి, ఆమ్మాక్, బెర్, మందార, కదంబ, గుల్మోహర్, జంగిల్ జిలేబీ, బౌగెన్ విల్లా, బ్రహ్మి తదితర మొక్కలు ఉన్నాయి. ఇవికాకుండా షీశం, వెదురు, ఒలియాండర్, టెకోమా, కచ్నార్, మహోగని, నిమ్మ, మునగ వంటి మొక్కలతోనూ అడవులు పెంచారు.
చెట్టు పొడవు, నీడ ఆధారంగా ఆక్సీజన్..
ప్రయాగ్‌రాజ్‌లో 8 నుంచి 10 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలను 15 నుంచి 20 అడుగుల ఎత్తులో ఉన్న మొక్కల కింద నాటారు. మర్రి, వేప, పొట్లు, పనస, మామిడి, జామ, కదం వంటి మొక్కలు, మర్రి వంటి సంప్రదాయ ఆకులతో కూడిన చెట్లు ఏడాదికి 10 మంది స్వాస పీల్చుకునేంత ఆక్సీజన్ విడుదల చేస్తాయి. ఆక్సీజన్ మొక్క పొడవు, దాని నీడ ప్రాంతంపై ఆధారపడి ఉంటుందని ప్రయాగ్‌రాజ్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ సింగ్ తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన చెట్లు 230 లీటర్ల ఆక్సిజన్ విడుదల చేస్తుంది. సాధారణ వ్యక్తి రోజుకు 550 లీటర్ల ఆక్సీజన్ తీసుకుంటాడు.
మియావాకీ టెక్నిక్ అంటే ఏమిటి
మియావాకీ టెక్కిక్(Miyawaki Technics) జపనీస్ ప్లాంటేషన్ పద్ధతి. పరిమిత స్థలంలో పెద్ద సంఖ్యలో మొక్కలు అవసరమైనప్పుడు ఇది ఉపయోగపడుతుంది. జపనీస్ వృక్ష శాస్త్రజ్ఞడు అకిరా మియావాకీ 1970లో ఈ సాంకేతికతను అభివృద్ధి చేశాడు.