BJP’s new strategy in UP: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ప్రధానమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. ఇక్కడ గెలిస్తే.. హస్తినాపురాన్ని హస్తగతం చేసుకోవచ్చని జాతీయ పార్టీలు భావిస్తుంటాయి. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం యూపీ. ఇక్కడ 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో సత్తా చాటడం ద్వారా తమకు అనుకూల పవనాలు ఉన్నాయని చాటేందుకు పార్టీలు ఉవ్విళ్లూరుతుంటాయి. గత ఎన్నికల్లో ఏకంగా 300 పైచిలుకు సీట్లు దక్కించుకొని తిరుగులేని విజయం సాధించింది బీజేపీ. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉందనే ప్రచారం ఉంది. యోగీ పాలనపై అసంతృప్తి గట్టిగానే ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో.. శాసనసభ ఎన్నికలకు ఏడాది ముందు నుంచే దిద్దుబాటు చర్యలు చేపట్టింది యోగీ సర్కారు.
యూపీలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బే తగిలింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. విపక్షాలు ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సత్తా చాటాయి. మెజారిటీ స్థానాలను విపక్షాలే దక్కించుకున్నాయి. రామ మందిరం నిర్మిస్తున్న అయోధ్య, మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి వంటి చోట్ల కూడా బీజేపీ ఓటమిపాలైంది. దీంతో.. ఆ పార్టీ అగ్ర నేతల్లో అంతర్మథనం మొదలైంది. దీంతో.. వరుస భేటీలు నిర్వహించి, సమీక్షలు నిర్వహించారు. ఆ ఫలితం వెంటనే కనిపించింది.
పంచాయతీ ఎన్నికల తర్వాత.. పంచాయతీ చైర్ పర్సన్ సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. మొత్తం 3 వేల మంది జిల్లా పంచాయతీ సభ్యులు 75 మంది చైర్ పర్సన్లను ఎన్నుకోవాల్సి ఉండగా.. 67 పంచాయతీ స్థానాల్లో కాషాయ జెండా ఎగిరింది. ప్రధాన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ కేవలం 6 స్థానాలకే పరిమితమైంది. దీంతో.. బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. శాసనసభ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని చెప్పుకొచ్చారు. అయితే.. విపక్షాలు మాత్రం విమర్శలు గుప్పించాయి. పంచాయతీ సభ్యులను ప్రలోభ పెట్టి బీజేపీవైపు తిప్పుకున్నారని ఆరోపించాయి.
అయితే.. ఎన్నికల వేళ యూపీలోని యువతను ఆకర్షించేందుకు ఉచిత పథకాలను ప్రవేశపెడుతోంది బీజేపీ. రాష్ట్రంలోని కోటి మంది యువతకు స్మార్ట్ ఫోన్లు, ట్యాబలు అందిస్తామని తెలిపింది. ఈ మేరకు మూడు వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రకటించింది. అంతేకాదు.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తుందట. ఇందుకోసమే అన్నట్టుగా.. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ 7 వేల కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ ను యోగీ సర్కారు ఆమోదించడం గమనార్హం.
దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేవలం ఎన్నికల కోసం తెస్తున్న ఇలాంటి పథకాలను ప్రజలు నమ్మరని అంటున్నాయి. గత ఎన్నికల ముందు ఏకంగా 150 హామీలు ఇచ్చిందని, ఒక్కటీ నెరవేర్చలేదని సమాజ్ వాదీ పార్టీ ఆరోపించింది. బీజేపీ మాత్రం.. 99 శాతం హామీలు నెరవేర్చామని చెబుతోంది. ఎస్పీ మాత్రం ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అదే తమను గెలిపిస్తుందని భావిస్తోంది. బీజేపీ మాత్రం ఉచిత పథకాలతో ముందుకు సాగుతోంది. మరి, ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారన్నది చూడాలి.