RS Praveen Kumar : రాజ్యాంగం రాసిందే మాతాత అని మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ (BSP) నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) వ్యాఖ్యానించారు. దళితులను చిన్నచూపు చూసే బూర్జువా పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. దళితులకు చదువు రాదని ఓ ఎమ్మెల్యే చులకనగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజినీర్లు, ఇంకా ఇతర పదవుల్లో దళితులు కొనసాగుతున్న విషయం ఆయనకు కనిపించలేదా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో పెనుమార్పులు రావాలని ఆకాంక్షించారు. రాబోయేది బహుజనుల రాజ్యమేనని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలదే రాజ్యాధికారం కావాలని సూచించారు. ఇంతవరకు దోచుకున్న డబ్బును తిరిగి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఆ డబ్బును విద్య, ఉఫాధి, వైద్య రంగాలకు ఉపయోగించి రాష్ర్టం ఎదిగేందుకు బాటలు వేస్తామని చెప్పారు.
ప్రగతి భవన్ ను బహుజన భవన్ గా మారుస్తామని అన్నారు. మనకు కావాల్సింది గులాబీ తెలంగాణ కాదని నీలి తెలంగాణ అని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏనుగు గుర్తు గెలవాలని దేవున్ని పూజించాలని కోరారు. తాము కాన్షీరాం, అంబేద్కర్ వారసులమని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తామని అన్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భవిష్యత్ కాలం అంతా తమ వైపే ఉంటుందని దీమా వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలే పాలనాధికారులు కావాలని ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే దళితబంధు పథకం తీసుకొచ్చారని గుర్తు చేశారు. పాలకుల మాటలు నమ్మే స్థితిలో ఎవరు లేరని పేర్కొన్నారు. దళితులపై కపట ప్రేమ చూపే పాలకులపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎన్నికల కోసమే పథకాలు చేపడుతూ వాటిని నిరంతరం అమల్లో ఉంచకుండా తరువాత మరిచిపోయే నాయకులకు ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పాలకుల కుట్రకు బలి కావద్దని సూచించారు.
రాజ్యాంగాన్ని రాసిన దళితులకు ఇంకా తెలివి తక్కువగా ఉంటుందని నేతలు నోరు జారడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి లబ్ధి కోసం ఇతరులపై బురదజల్లే వారి పట్ల కూడా తెలుసుకోవాలని చెప్పారు. రాజ్యాంగ పదవుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. బీసీ, ఎస్టీ, ఎస్టీ లందరు ఐక్యం అయితే ఎంతటి శక్తినైనా ఎదిరించగల సత్తా మనకు కూడా ఉంటుందని చెప్పారు. కపట పార్టీల రంగు బయటపెట్టి వాటిని రాజకీయాలకు దూరం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. దీని కోసం అందరం కలికట్టుగా నిలబడాలని సూచించారు.