Homeజాతీయ వార్తలుUttar Pradesh: యూపీలో యోగి మార్క్ న్యాయం.. మరో నేరస్తుడు హతం

Uttar Pradesh: యూపీలో యోగి మార్క్ న్యాయం.. మరో నేరస్తుడు హతం

Uttar Pradesh: ఆడపిల్లల పై వేధింపులకు పాల్పడితే తొక్కి నార తీస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తే బుల్డోజర్ తో కూల్చేస్తున్నారు. తిక్క తిక్కగా మాట్లాడితే పోలీస్ మర్యాదలు చేస్తున్నారు. సంఘవిద్రోహ కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులు తమ తుపాకులకు పని చెబుతున్నారు. కాకలు తీరిన గ్యాంగ్ స్టర్లు అయినప్పటికీ, ఊడలు దిగిన హంతకులు అయినప్పటికీ పోలీసులు వెనుకంజ వేయడం లేదు. దారి కాచి మరీ మట్టు పెడుతున్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తిక్క కుదుర్చుతున్నారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న యోగి మార్క్ న్యాయం. వాస్తవానికి ముల్లును ముల్లుతోనే తీయాలంటారు. ఇప్పుడు ఆ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నారు యోగి.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ శాంతి మీద దృష్టి సారించారు.. అల్లరి మూకల ఆగడాలను అణగదొక్కారు. సంఘవిద్రోహశక్తుల పీచమణిచారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న గ్యాంగ్ స్టర్లకు పోలీసు తూటాల రుచి చూపించారు. మరి కొంతమందిని జైల్లో వేశారు. యోగి దెబ్బకు రౌడీ షీటర్లు స్వచ్ఛందంగా జైళ్ళకు వెళ్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన భవనాలను యోగి ప్రభుత్వం రెండో మాటకు తావు లేకుండానే కూల్చేస్తోంది. పైగా అక్రమాలకు పాల్పడిన వారిని జైల్లోకి పంపిస్తోంది. జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో అత్యాచారాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు యోగి ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాలు అమలు చేస్తోంది. ఆడపిల్లలను వేధించే వారిని రెండవ మాటకు తావులేకుండానే పైకి పంపిస్తోంది. సర్కారు అమలు చేస్తున్న ఈ నిబంధన వల్ల ఆడపిల్లలపై అత్యాచారాల సంఖ్య తగ్గింది.

తాజాగా ఓ ఆడపిల్లను వేధిస్తున్న నేరస్థుడిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.రైల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు అనీస్ ఖాన్‌ శుక్రవారం పోలీసుల కాల్పుల్లో హతమయ్యాడు. గత కొంతకాలంగా పరారీలో ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా.. కాల్పులు జరిపాడు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతను మరణించగా, మరో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఆగస్టు 30న సరయూ ఎక్స్‌ప్రెస్ లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై నిందితులు దాడి చేశారు. బోగీలో మహిళా కానిస్టేబుల్‌ ఒంటరిగా ఉన్నారని.. ఆ సమయంలో అనీస్ ఖాన్‌, ఆజాద్‌, విశంభర్‌ దోపిడీకి ప్రయత్నించారు. కానిస్టేబుల్‌ ప్రతిఘటించడంతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ బాధిత కానిస్టేబుల్ చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వారు దొరికిపోయారు. వారిని పోలీసులు ఎన్కౌంటర్లో లేపేశారు. కాగా, యోగి ఆదిత్యనాథ్‌ యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరేళ్లలో మొత్తం 183 మంది నేరగాళ్లను ఎన్‌కౌంటర్లలో హతమార్చినట్లు పోలీసులు ఇటీవల వెల్లడించారు. ఇక అనధికారికంగా ఎన్ని వందల ఎన్కౌంటర్లు చేశారో అర్థం చేసుకోవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular