Mynampally Hanumanth Rao: అనుకున్నట్టుగానే మైనంపల్లి హనుమంతరావు కారు దిగారు. చేయి అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. అక్కడ దాదాపుగా సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మల్కాజ్ గిరి హనుమంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు రోహిత్ కుమార్ కు టికెట్లు ఖాయం అయ్యాయని తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి టికెట్ కేటాయించినప్పటికీ.. మంత్రి హరీష్ రావు మీద వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా హనుమంతరావు వార్తల్లో వ్యక్తి అయిపోయారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వని పక్షంలో తాను కూడా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి ఆయనపై వేటు వేస్తుందని ప్రచారం జరిగింది. కానీ దాని కంటే ముందుగానే హనుమంతరావు పార్టీకి రాజీనామా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీలో కొనసాగబోనని స్పష్టం చేశారు. శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు. మల్కాజ్‌గిరి ప్రజలు, తన కార్యకర్తలు, రాష్ట్రం నలుమూలలా ఉన్న తన శ్రేయోభిలాషుల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ వీడియోలో ఆయన వెల్లడించారు. ఏ పార్టీలో చేరేది త్వరలో తప్పకుండా చెబుతానన్నారు. ‘‘మీ అందరి సహకారాన్నీ నా కంఠంలో ఊపిరున్నంత వరకూ మరచిపోను. నన్ను నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు అండగా ఉంటా. ప్రజల కోరిక మేరకు ముందుకు నడుస్తా. దేనికీ లొంగే ప్రసక్తి లేదు’’ అని పేర్కొన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి గత నెల 21న తిరుపతిలో.. మంత్రి హరీశ్‌రావుపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించడానికి కొన్ని గంటల ముందు ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. మెదక్ టికెట్ తన కుమారుడికి రాకుండా హరీశ్ అడ్డుకుంటున్నారని.. మల్కాజ్‌గిరి నుంచి తనకు, మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్‌కు అవకాశం కల్పించాలని.. లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటి చేస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు. ఆ వ్యాఖ్యలను పార్టీ అగ్రనాయకత్వం సీరియస్ గా తీసుకోవడంతో.. అప్పటి నుంచి పార్టీకి హన్మంతరావు దూరంగా ఉంటున్నారు. ఆయనపై పార్టీ వేటు వేస్తుందనే ఊహగానాలు వెలువడినా.. అధిష్ఠానం అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదు. సస్పెండ్ చేయక.. పార్టీ నుంచి సానుకూల సంకేతాలూ రాకపోవడంతో హన్మంతరావు బీఆర్‌ఎస్ ను వీడాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. తన కుమారుణ్ని ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలోకి దించాలని భావిస్తున్న మైనంపల్లి.. బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచే కాంగ్రెస్, బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్ లో చేరాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఈమేరకు సోమవారం (25న) ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారైనట్టు తెలిసింది. రాజీనామా ప్రకటన కూడా ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించాకే చేసినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరి ఢిల్లీ నుంచి నగరానికి వచ్చిన అనంతరం..శంషాబాద్ విమానాశ్రయం నుంచి వందలాది కార్లతో ర్యాలీగా మల్కాజ్‌గిరికి చేరుకుంటారని అనుచరులు పేర్కొంటున్నారు. అలాగే.. మల్కాజ్‌గిరి లేదా కుత్బుల్లాపుర్ నుంచి హన్మంతరావు, మెదక్ నుంచి ఆయన కుమారుడు పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తయిందని మైనంపల్లి అనుచరులు చెబుతున్నారు. ఎలాగైనా మెదక్ స్థానంలో పద్మ దేవేందర్ రెడ్డి పై గెలిచి హరీష్ రావుకు ఝలక్ ఇవ్వాలని హనుమంతరావు భావిస్తున్నట్టు తెలుస్తోంది. హనుమంతరావు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కావడంతో హరీష్ రావును సులభంగా ఢీకొట్టొచ్చని కాంగ్రెస్ వర్గాలు అనుకుంటున్నాయి. ఇదే సమయంలో సిద్దిపేటలో కూడా హరీష్ రావుకు వ్యతిరేకంగా ముసలం కూడా సృష్టించాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో హనుమంతరావు హరీష్ రావు ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని శపథం చేయడం ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు గుర్తు చేసుకుంటున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Mynampally hanumanth rao from malkaj giri rohit from medak
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com