కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించి అతలాకుతలం చేస్తోన్న చైనాకు అమెరికా గట్టి షాక్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేసింది. చైనా అంటేనే చిర్రెత్తిపోతున్న ట్రంప్ తాజాగా చైనాకు చెందిన టిక్ టాక్ , వీచాట్ యాప్ లను నిషేధిస్తున్నట్టు అమెరికా భద్రతా విభాగం ద్వారా ప్రకటించారు. ఆదివారం నుంచి ఈ రెండు యాప్ లు డౌన్ లోడ్ లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటనలో తెలిపింది.
ఇప్పటికే అమెరికా పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా సేకరిస్తోందని వాణిజ్య విభాగం కార్యదర్శి వెల్లడించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
బైట్ డ్యాన్స్ లిమిటెడ్ కు చెందిన టిక్ టాక్ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సిన్ చేస్తున్నందుకు అమెరికా భద్రతా విభాగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఆంక్షలను వెల్లడిస్తామని వాణిజ్య విభాగం తెలిపింది.
ఇటీవలే ట్రంప్ టిక్ టాక్ నిషేధాన్ని పరిశీలిస్తున్నానంటూ పేర్కొన్నారు. తాజాగా అమెరికా భద్రత విభాగం నిషేధిస్తున్నట్టు ప్రకటించింది.
ఇప్పటికే భారత్ కూడా చైనా యాప్ లను భారీగా నిషేధించింది. ఇప్పుడు అమెరికా కూడా నిషేధం విధించడంతో చైనాకు గట్టి షాక్ తగిలింది