
రాజకీయం అంటే ఆలోచించి అడుగులు వేయాలి. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. కానీ.. ఆలోచిస్తూనే ఉండిపోతే..? పుణ్యకాలం కాస్తా కరిగిపోతుంది. అమృతం కాస్తా.. విషయం అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల ఫలితం కూడా ఇలాగే మారిపోతోందనే అభిప్రాయయం తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. పార్టీలోని అసంతృప్తులను కనీసం పట్టించుకోవడం లేదని, ఎన్ని సార్లు మొరపెట్టుకుంటున్నా వినిపించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఎన్నో పనులు ఉంటాయి. హెక్టిక్ షెడ్యూల్ అమల్లో ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలను, నిర్ణయాలను చూసుకోవడానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టి.. పార్టీకి తగినంత సమయం ఇవ్వలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. విపక్షంలో ఉన్నప్పుడు ఇంకేముంటుందీ? మొత్తం ఖాళీనే కదా? ఈ సమయంలో సైకిల్ ను రిపేర్ చేసుకోవచ్చు. చేసుకోవాలి కూడా. రిమ్ములు బెండు తీయడం.. ట్యూబులకు ప్యాచీలు వేసుకోవడం.. బ్రేకులు సరిచేసుకోవడం.. బెల్ సరిగా మోగుతోందో లేదో చూసుకోవడం.. వంటివన్నీ చేయాలి. ఆ తర్వాత ఎన్నికల రేసులో రయ్యుమని దూసుకెళ్లాలి. కానీ.. విపక్షంలో ఉండి కూడా చంద్రబాబు ఈ పని సరిగా చేయట్లేదని తమ్ముళ్లే అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం గమనించాల్సిన అంశం.
శ్రీకాకుళం జిల్లాలోని పలువురు ముఖ్య నేతలు చంద్రబాబు నిర్ణయాల కోసం వేచి చూస్తున్నారు. రాజాం నియోజకవర్గంలో కోండ్రు మురళికి బాధ్యతలు ఇచ్చినా.. ఆయన పార్టీని గాలికి వదిలేశారని, గ్రీష్మకు అప్పగించాలని పలువురు కోరుతున్నారు. అయినా.. సరే బాబు పట్టించుకోవట్లేదట. ఇస్తామనో.. ఇవ్వమనో ఏదీ చెప్పకుండా నాన్చుతున్నారట.
పలాస నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన గౌతుశిరీష.. తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను అందించినా.. బాబు లైట్ తీసుకున్నారట. ఇక, గత ఎన్నికల్లో పార్టీ కోరిందని లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకున్నవారి జేబులు ఖాళీ అయ్యాయి. కానీ.. ఇంత వరకు వారికి ఇస్తానని చెప్పిన డబ్బులు కూడా ఇవ్వలేదట. దీంతో.. చాలా మంది పార్టీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారట.
ఇలా.. ఎంతో మంది పలు సమస్యలతో బాబు చుట్టూ తిరుగుతున్నా.. ఒక నిర్ణయం చెప్పట్లేదట చంద్రబాబు. దీంతో.. నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇక, మరికొందరు సీనియర్లు వైసీపీ నేతలతో లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుని, పార్టీని పట్టించుకోవట్లేదని.. అందువల్ల తమకు బాధ్యతలు ఇవ్వాలని కొందరు కోరుతున్నా కూడా బాబు పట్టించుకోవట్లేదట. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. పార్టీ ఎలా పుంజుకుంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. మరి, బాబు ఏమంటారో?