Khammam TRS: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమేనని అంతర్గత సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఓటర్లలో దాదాపు 70 శాతం మంది టీఆర్ఎస్ కు చెందినవారే. లీడర్ల మద్దతు సైతం పుష్కలంగా ఉంది. ఓ వైపు చేతిలో అధికారం… మరో వైపు చెప్పినట్టు పని చేసే యంత్రాంగం ఉంది. క్రాస్ ఓటింగ్ కాకుండా ఉండేందుకు అధికార పార్టీ తన ఓటర్లను క్యాంపులకు సైతం తరలించింది. ఇన్ని చేసినా టీఆర్ఎస్ పార్టీనీ ఏదో గుర్తుతెలియని గుబులు వెంటాడుతోంది. కొద్ది గంటల్లోనే ఎమ్మెల్సీ పోలింగ్ జరగబోతుండటంతో ఆ పార్టీ లీడర్లకు టెన్షన్ పట్టుకుంది. ఎక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందోనన్న భయం పార్టీని వెంటాడుతోంది.

ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ లో టికెట్ కుంపటి కొనసాగుతోంది. తుమ్మల వంటి సీనియర్ నేతలున్నా.. అధిష్ఠానం మాత్రం తాతా మధుకు టికెట్ ఇచ్చింది. దీంతో సీనియర్ నాయకుల్లో అసంతృప్తి చాలా పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం వారు సహకరించడం లేదని టాక్. తాతా మధుకు టికెట్ వచ్చేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తీసుకున్న చొరవే కారణమని వార్తలు వస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం అధిష్ఠానం ఇలా చేస్తోందా అన్నది సస్పెన్స్. సిట్టింగ్ సీటు సైతం ఇవ్వకుండా చేస్తున్నారని మరో వైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఆరోపిస్తూ.. చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి టికెట్ ఆశించిన వారిలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, గాయత్రి రవి, సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు ఉన్నారు. తుమ్మలకు టికెట్ ఇచ్చి ఆయనను మంత్రి పదవి కట్టబెడతారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ టీఆర్ఎస్ అధినేత నిర్ణయంతో దానికి చెక్ పడింది.
Also Read: Andhra Pradesh: ఏపీ భవిష్యత్ ప్రశ్నార్థకం.. రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీకి అక్కర్లేదా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచేంత స్థాయిలో ఓట్లర్లు లేరు. కానీ తాతా మధు సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వర్ రావుకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇచ్చారు. టీఆర్ఎస్ కు చెందిన ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీగానే వనరులను సమకూర్చినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గోవా క్యాంపులోనూ వివక్ష ఎదురైందన్న అసంతృప్తి సైతం బయటకు వస్తోంది. సామాజికవర్గం, స్థాయి ఆధారంగా ట్రీట్ చేయడంతో కొంతమంది ఓటర్లు అసంతృప్తికి లోనయ్యారు. ఇలాంటి పరిణామాలను చూసి ఓటర్లు పార్టీకి ఎక్కడ దూరమవుతారోనన్న భయం టీఆర్ఎస్ ను వెంటాడుతోంది.
Also Read: KCR vs BJP: కేసీఆర్ కు చెక్ పెట్టే బీజేపీ వ్యూహం: కీలక నేతలను ఢిల్లీకి పిలిచిన అమిత్ షా